Share News

రాజుకున్న రాజకీయ వేడి

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:40 PM

గతానికి భిన్నంగా మన్యంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటున్నది. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూటమి, వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, స్వతంత్రలు పోటాపోటీగానే నామినేషన్లను దాఖలు చేశారు.

రాజుకున్న రాజకీయ వేడి
నామినేషన్లను పరిశీలిస్తున్న ఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ

అధికార, విపక్షాలు పోటాపోటీగా నామినేషన్లు

జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ-35,

టీడీపీ-34, జనసేన-16, బీజేపీ- 13

ఎంపీటీసీ స్థానాల్లోనే అదే పోటీ...

వైసీపీ- 400, టీడీపీ- 346 నామినేషన్లు

సజావుగా నామినేషన్ల పరిశీలన

నేడు అభ్యంతరాలకు అప్పీళ్లు

పాడేరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

గతానికి భిన్నంగా మన్యంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటున్నది. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూటమి, వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, స్వతంత్రలు పోటాపోటీగానే నామినేషన్లను దాఖలు చేశారు. గతంలో జడ్పీటీసీ స్థానానికైనా, ఎంపీటీసీ స్థానానికైనా గరిష్ఠంగా ఐదుగురు పోటీ పడే పరిస్థితి ఉండేది కాదు. కాని ఈసారి ఎన్నికల్లో అందుకు భిన్నంగా అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు 144, 172 ఎంపీటీసీ స్థానాలకు 1,100 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలిస్తే.. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి 13 మంది, ఎంపీటీసీ స్థానానికి ఏడుగురు చొప్పున నామినేషన్లను వేశారు.

ఎంపీటీసీ స్థానాలకు 400 వైసీపీ నామినేషన్లు

జిల్లాలోని 172 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 1,100 నామినేషన్లు పడగా.. వాటిలో వైసీపీ నుంచి అత్యధికంగా 400 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నేతలు 346, స్వతంరత్రులు 101, జనసేన 91, బీజేపీ 65, సీపీఎం 56, కాంగ్రెస్‌ 38, బీఎస్‌పీ 2, ఆప్‌ నుంచి 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లలో వైసీపీవే 400 కావడం విశేషం. అలాగే 172 జడ్పీటీసీ స్థానాలకు 144 నామినేషన్ల పడగా.. వాటిలో వైసీపీ 35, టీడీపీ 34, జనసేన 16, బీజేపీ 13, కాంగ్రెస్‌ 12, సీపీఎం 7, ఆప్‌ 4, బీఎస్‌సీ 1 నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లాలో అత్యధికంగా అరకులోయ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు 124 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా ముంచంగిపుట్టు మండలంలో 14 స్థానాలకు 61 నామినేషన్లు దాఖలయ్యాయి.

సజావుగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నాయకులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం సజావుగా జరిగింది. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ బృందం పరిశీలన చేయగా, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌ దాఖలు చేసిన వారి అభ్యంతరాలు, సమస్యలుంటే ఆదివారం సంబంధిత నామినేషన్‌ సెంటర్‌లో అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆదివారం కూడా నామినేషన్‌ కేంద్రాలకు వచ్చి తమ నామినేషన్లలో నెలకొన్న సమస్యను నాయకులు పరిష్కరించుకోవచ్చు. శనివారం జిల్లాలో జరుగుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరిలోని నామినేషన్‌ కేంద్రాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిశీలించాలని, ఈక్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు పరిశీలకుడు కూర్మనాథ్‌ ఆదేశించారు.

Updated Date - Oct 24 , 2026 | 11:40 PM