Share News

పోలీసుల డ్రోన్‌స్త్రం

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:36 AM

ఆకతాయిలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసులు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.

పోలీసుల డ్రోన్‌స్త్రం

  • అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు సాంకేతిక పరిజ్ఞానం

  • సహాయం తీసుకుంటున్న నగర పోలీసులు

  • 15 డ్రోన్‌లతో నిరంతర నిఘా

  • రెండేసి పోలీస్‌ స్టేషన్‌లకు ఒకటి కేటాయింపు

  • ఆపరేటింగ్‌పై 210కి మందికి శిక్షణ

  • నిర్జన ప్రదేశాల్లో పేకాట, బహిరంగ ప్రదేశాల్లో తాగుడుకు చెక్‌

  • ఈవ్‌టీజింగ్‌కు కూడా...

  • రాత్రివేళ కూడా స్పష్టమైన రికార్డింగ్‌

  • త్వరలో మరో తొమ్మిది డ్రోన్‌లు రాక

  • సంక్రాంతి నేపథ్యంలో కోడిపందాలకు ముకుతాడు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆకతాయిలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసులు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా బహిరంగ మద్యపానం, పేకాట, ఈవ్‌టీజింగ్‌ వంటి వాటికి చెక్‌ చెబుతున్నారు. రానున్న రోజుల్లో నేరాల నియంత్రణకు డ్రోన్‌లను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు అమలు చేయనున్నారు.

నగర పోలీసులు టెక్నాలజీ సహాయంతో నేరాలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టిసారించారు. పేకాట, బహిరంగ మద్యపానం, ఆకతాయిలు, బైక్‌రేసింగ్‌లకు పాల్పడేవారిని గుర్తించేందుకు గతంలో నేరుగా వెళ్లాల్సి ఉండేది. అయితే పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, తరచూ ఈవ్‌టీజింగ్‌లు, చోరీలు జరిగే ప్రాంతాల్లో ‘డ్రోన్‌’లతో నిఘా పెట్టాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా సీఎస్‌ఆర్‌ నిధులతో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 15 డ్రోన్‌లను సమకూర్చారు. డ్రోన్‌ను ఆపరేట్‌ చేసేందుకు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, క్రైమ్‌ విభాగాల నుంచి స్టేషన్ల వారీగా ఎంపిక చేసిన 210 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో రెండు, మూడు పోలీస్‌ స్టేషన్లకు ఒక డ్రోన్‌ చొప్పున, బీచ్‌ పెట్రోలింగ్‌ కోసం మూడు డ్రోన్‌లను కేటాయించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం ఆయా డ్రోన్‌లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా తోటలు, పొదలు ఉన్నట్టయితే వాటిలో ఎవరైనా ఉన్నారా?, పేకాట, మద్యపానం, గంజాయి సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా?, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నారా?...అని నిశితంగా పరిశీలిస్తున్నారు. గత పది నెలల్లో బహిరంగ మద్యపానం చేస్తున్న 450 మందితోపాటు గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని, పేకాట ఆడుతున్న 200 మందిని గుర్తించి కేసులు నమోదుచేశారు. అలాగే పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిని, బస్టాపుల్లో ఈవ్‌టీజింగ్‌ చేసేవారిని పదుల సంఖ్యలో గుర్తించి చర్యలు తీసుకున్నారు.

ఐదు కిలోమీటర్ల పరిధిలో నిఘా

ఒక్కో డ్రోన్‌ ఐదు కిలోమీటర్లు పరిధి వరకూ వెళ్లి వీడియో రికార్డు చేస్తుంది. డ్రోన్‌ రెండు కిలోమీటర్లు ఎత్తుకు ఎగరగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ నగరంలో రక్షణశాఖాపరంగా ఉన్న ఆంక్షల కారణంగా 120 మీటర్లు ఎత్తు వరకు మాత్రమే ఆపరేట్‌ చేస్తున్నారు. డ్రోన్‌లకు ఎనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ కూడా ఉంది. డ్రోన్‌ ఎగరవేసే పోలీసులు ఎలాంటి హెచ్చరికలు, సూచనలు జారీచేసినా ఆ ప్రాంతంలో వినిపిస్తుంది. డ్రోన్‌లకు అమర్చిన అత్యాధునిక కెమెరా, ఫోకస్‌ లైట్లు కారణంగా చీకట్లో కూడా మనుషులు, వస్తువులు, వాహనాలు, రోడ్లు స్పష్టంగా కనిపించేలా వీడియో రికార్డు చేస్తుంది. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు డ్రోన్‌ రికార్డింగ్‌లో కనిపిస్తే పోలీసులు అక్కడకు చేరుకుంటున్నారు. ఒకవేళ ఫోకస్‌ లైట్‌ వెలిగితే ఆకతాయిలు, నేరస్థులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకుంటారని భావిస్తే, రిమోట్‌ ద్వారా దానిని ఆపేయవచ్చు. దీనివల్ల ఎలాంటి చప్పుడు లేకుండానే పోలీసులు లక్ష్యం వద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో డ్రోన్‌ల సహాయంతో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై భారీగా కేసులు నమోదు చేస్తున్నారు.

త్వరలో మరో తొమ్మిది డ్రోన్‌లు

ర్యాలీలు, ధర్నాలతోపాటు ప్రముఖుల పర్యటనలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలు జరుగుతుండడంతో బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల కోసం మరిన్ని డ్రోన్‌లను సమకూర్చుకోవాలని నగర పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 15 డ్రోన్‌లకు అదనంగా తొమ్మిది డ్రోన్‌లను కొత్తగా సమకూర్చుకునేలా కొన్ని కంపెనీలను సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించేందుకు ఒప్పించారు. సంక్రాంతి పండుగ కోడిపందాలు, పేకాట వంటి వాటికి ఈసారి డ్రోన్‌ల ద్వారా అడ్డుకట్ట వేయవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 01:36 AM