Share News

చలాన్లపైనే పోలీసుల గురి!

ABN , Publish Date - May 14 , 2026 | 01:33 AM

చలాన్లపైనే పోలీసుల గురి!

చలాన్లపైనే పోలీసుల గురి!
స్వర్ణభారతి ఆడిటోరియం ఎదురుగా రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనాలు ఆపుతున్న ట్రాఫిక్‌ పోలీసులు

రోడ్డుకు అడ్డుపడి మరీ వసూలు

బెంబేలెత్తుతున్న ద్విచక్ర వాహనదారులు

త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోజూ ఇదే తీరు

చలాన్‌లు క్లియర్‌ చేస్తేనే తాళాలు

కుటుంబాలతో మండుటెండలో వాహనదారుల నిరీక్షణ

మద్దిలపాలెం, మే 13 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తమ విధులను పక్కనపెట్టి ద్విచక్ర వాహన చోదకుల నుంచి చలాన్‌ల వసూలుపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు అడ్డుగా నిల్చొని మండుటెండలో వాహనదారులను ఆపుతున్నారు. చలాన్‌లు లేకున్నా, రోడ్డుపై నిలిపివేసి చెక్‌ చేస్తుండడంతో మండుటెండలో కుటుంబాలతో సహా ఇబ్బందిపడాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగర పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరపై దృష్టి పెట్టాల్సి ఉండగా, దానిని గాలికి వదిలేసి చలాన్ల వసూళ్లపైనే దృష్టిసారిస్తున్నారు. నడ్డిరోడ్డుపై నిలబడి వాహనాలను నిలువరిస్తున్నారు. చలానాలు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. వాహనాల తాళాలు తీసుకుని, చెల్లిస్తేనే తిరిగి ఇస్తామని బెదిరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో రద్దీ సమయంలో అకస్మాత్తుగా వాహనాలను ఆపడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. మద్దిలపాలెం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, స్వర్ణభారతి ఆడిటోరియం ఎదురుగా, సిరిపురం, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ప్రతిరోజూ ఇదే పరిస్థితి నెలకొంది.

విధులకు వెళ్లేవారిని నిలువరించి

సాధారణంగా ఉద్యోగులు ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో విధులకు పరుగులు పెడుతుంటారు. ఆ సమయంలోనే రోడ్డుపైకి చేరుతున్న ట్రాఫిక్‌ పోలీసులు రేసపువానిపాలెం, సిరిపురం, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏరియాల్లో అడ్డుపడి నిలువరిస్తున్నారు. ఐదారుగురు పోలీసులు వాహనాలను ఆపి, పక్కకు తీయిస్తున్నారు. బైక్‌ల నంబర్లు యాప్‌లో చెక్‌ చేసి, పెండింగ్‌ చలానాల వసూలు చేస్తున్నారు. పనులకు ఆలస్యమవుతోందని వేడుకున్నా పట్టించుకోవడం లేదని, పైగా వాహనాల తాళాలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని వాహనచోదకులు లబోదిబోమంటున్నారు. పోలీసు చర్యల ఫలితంగా ఒక్కోసారి అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని ముందుకు కదలలేని పరిస్థితి ఎదురవుతోంది.

చలాన్లు చెల్లిస్తేనే వాహన తాళాలు

రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులు ద్విచక్ర వాహనాలు ఆపిన వెంటనే తాళాలు తీసేసుకుంటున్నారు. అనంతరం యాప్‌లో పెండింగ్‌ చలానాలను పరిశీలించి, బకాయిలు చెల్లిస్తేనే తాళాలు ఇస్తామని, లేదంటే స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు లేవని బతిమాలాడినా వినిపించుకోకపోవడంతో అప్పటికప్పుడు బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి, చలానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చోదకులు చెబుతున్నారు. ఈ ప్రకియ ముగిసేంత వరకు భార్య, పిల్లలతో ఎండలో నడిరోడ్డుపై నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు.

Updated Date - May 14 , 2026 | 01:33 AM