చెరువులకు చెర
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:44 AM
పెందుర్తి రెవెన్యూ పరిధిలోని చెరువులను కబ్జాదారులు చెర పడుతున్నారు.
పెందుర్తిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
కాలనీలు నిర్మించి మరీ అమ్మకాలు
ప్లాట్లుగా విభజించి విక్రయాలు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఎమ్మెల్యే
పెందుర్తి, మే 31 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి రెవెన్యూ పరిధిలోని చెరువులను కబ్జాదారులు చెర పడుతున్నారు. చెరువు స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించి దర్జాగా విక్రయించేస్తున్నారు. మరికొందరు ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. జల వనరుల సంరక్షణ చట్టాన్ని సవాల్ చేసి మరీ చెరువులను పరాధీనం చేస్తున్నారు.
పెందుర్తి సర్వే నంబరు 230లోని 20 ఎకరాల విస్తీర్ణమున్న గోకాడచెరువు ఆక్రమణలతో కుదించుకుపోయింది. కబ్జాదారుల దెబ్బకు చెరువు రూపురేఖలు మారిపోయా యి. పది ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైందని రెవెన్యూవర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే చెరువును ఆక్రమిం చి సుమారు 50 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని రెవెన్యూ విచారణలో తేలింది. అక్రమార్కులపై కేసులు పెట్టినా ఆక్రమణలు కొనసాగుతునే ఉన్నాయి.
విజయరామసాగర్ కనుమరుగు
పెందుర్తి సర్వే నంబరు 120లో 6.85 ఎకరాల విస్తీర్ణం గల విజయరామసాగర్ చెరువులో సుమారు రెండెకరాలను ఆక్రమించిన ఓ రియల్ వ్యాపారి సుమారు 40 ఇళ్లతో కాలనీని నిర్మించి, విక్రయించేశారు. ఇదే పంథాలో మిగిలిన చెరువు స్థలంలో అక్రమార్కులు పక్కా నిర్మాణాలు చేపట్టారు.
రాజు చెరువుకు ఎసరు
చినముషిడివాడ సర్వే నంబరు 163లో సుమారు 24.86 ఎకరాల విస్తీర్ణం గల రాజు చెరువు కనుమరుగవుతోంది. ఇప్పటికే సుమారు 20 ఎకరాలు ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు తమ విచారణలో తేల్చారు. చినముషిడివాడ నుంచి సుజాతనగర్ వరకు విస్తరించి ఈ చెరువు కనిపించకుండా పోయే పరిస్థితిలో ఉంది. ఓ స్థిరాస్థి వ్యాపారి సమీపంలోని జిరాయితీ స్థలాన్ని కొనుగోలు చేసి, దానికి ఆనుకుని ఉన్న చెరువును ఆక్రమించి మరీ ఇళ్లు నిర్మించి విక్రయించేశాడు. మరో రియల్ వ్యాపారి చెరువు స్థలాన్ని ప్లాట్లుగా విభజించి అమ్మేశాడు. కొంతమంది పేదల ముసుగులో చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇలా వందల షెడ్ల నిర్మాణాలు జరిగాయని అఽధికారులు చేపట్టిన సర్వేలో తెలిసింది. తప్పుడు సర్వే నంబర్లు, పత్రాలు, నకిలీ పట్టాలతో చెరువులను దర్జాగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు.
చినముషిడివాడ సర్వే నంబర్లు 185,186, 189లో గల పది ఎకరాల చెరవులో ఆక్రమణలున్నాయి. తమ్మివానిచెరువు, కృష్ణరాయపురం, లక్ష్మీపురంలోని రాముడు చెరువులు ఆక్రమణలతో కుదించుకుపోయాయి
నోటీసులు జారీచేసినా...
చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినా కబ్జాదారులు తగ్గడం లేదు. మూడేళ్ల క్రితం చెరువు, గెడ్డ, వాగుల్లో ఆక్రమణలపై 40 మందికి రెవెన్యూ సిబ్బంది నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఇవి వందల సంఖ్యకు చేరాయి. ఆక్రమణలతో బక్కచిక్కిన చెరువులకు వరదలు వస్తే పెందుర్తి మునిగిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రకటించడం చర్చనీయాంశమయింది.