వరి రైతుల తిప్పలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 01:02 AM
మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ మొదలైన తరువాత సరైన వర్షాలు లేకపోవడం, వరహా, సర్పా నదుల్లో నీటి ప్రవాహం లేకపోవడంతో గ్రోయిన్లు, ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు ప్రవహించడంలేదు. దీంతో సుమారు రెండు వేల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయన్న ఉద్దేశంతో ఇప్పటికే వరినారుమళ్లు పోసిన రైతులు, నారును బతికించుకోవడానికి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి, మడులను తడుపుకుంటున్నారు. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ మరో వారం, పది రోజుల్లో నారు అందుబాటులోకి వస్తుందని, ఈలోగా పొలాల దమ్ముకు సరిపడ వర్షాలు కురవకపోయినా, ఎగువ నుంచి నదుల్లో నీటి ప్రవాహం లేకపోయినా వరినారు ముదిరిపోయి నాటడానికి పనికిరాదని రైతులు వాపోతున్నారు.
వర్షాభావంతో ఎండిపోతున్న నారు
బతికించుకోవడానికి ట్యాంకర్లతో నీరు
ఒక్కోసారి రూ.1,000 ఖర్చు
నారు అందివచ్చినా.. నాట్లు వేయలేని పరిస్థితి
సర్పా, వరహా నదుల ఆనకట్టల నుంచి కాలువల్లోకి పారని నీరు
మాకవరపాలెం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ మొదలైన తరువాత సరైన వర్షాలు లేకపోవడం, వరహా, సర్పా నదుల్లో నీటి ప్రవాహం లేకపోవడంతో గ్రోయిన్లు, ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు ప్రవహించడంలేదు. దీంతో సుమారు రెండు వేల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయన్న ఉద్దేశంతో ఇప్పటికే వరినారుమళ్లు పోసిన రైతులు, నారును బతికించుకోవడానికి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి, మడులను తడుపుకుంటున్నారు. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ మరో వారం, పది రోజుల్లో నారు అందుబాటులోకి వస్తుందని, ఈలోగా పొలాల దమ్ముకు సరిపడ వర్షాలు కురవకపోయినా, ఎగువ నుంచి నదుల్లో నీటి ప్రవాహం లేకపోయినా వరినారు ముదిరిపోయి నాటడానికి పనికిరాదని రైతులు వాపోతున్నారు.
మాకవరపాలెం మండలంలో సర్పా, వరహా నదులపై నిర్మించిన ఆనకట్టల ద్వారా బూరుగుపాలెం, తాడపాల, పైడిపాల, లచ్చన్నపాలెం,మాకవరపాలెం, తామరం, జంగాపల్లి, నారాయణరాజుపేట, గిడితూరు గ్రామాల్లో సుమారు 1,200 ఎకరాల ఆయకట్టు వుంది. మామిడిపాలెంలో రిజర్వాయర్ కింద 200 ఎకరాలు, పాపయ్యపాలెం రిజర్వాయర్ ద్వారా 250 ఎకరాల ఆయకట్టు వుంది. ఏటా ఈ సమయానికి నదుల్లో వరద ప్రవాహం జోరుగా వుండేది. ఆనకట్టల ద్వారా కాలువల్లో నీరు ప్రవహించి, రైతులు వరినాట్లు వేస్తుండేవారు. అయితే ఈ ఏడాది తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా నదుల్లో చుక్క నీరు లేదు. ఇసుక దిబ్బలతో ఎడారిని తలపిస్తున్నాయి. మామిడిపాలెం, పాపయ్యపాలెం రిజర్వాయర్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ విద్యుత్తు బోర్లు, బావులు వున్న రైతులు మినహా మిగిలిన వారెవరూ ఇంతవరకు వరినాట్లు వేయలేదు. ఎల్‌నినో ప్రభావం వున్నప్పటికీ ఆగస్టులో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయన్న ఉద్దేశంతో పలువురు రైతులు గత నెలలో వరి ఆకుమడులు పోశారు. విత్తనాలు మొలిచిన తరువాత నారు పెరగడానికి సరిపడ వర్షాలు పడకపోవడంతో రైతులు వ్యవసాయ బోర్లు నుంచి ట్యాంకర్లతో నీటిని తీసుకువచ్చి వరి నారుమడులను తడుపుకోవాల్సి వస్తున్నది. ఈ విధంగా వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి వస్తున్నదని, ఒక్కో విడత నీటి రవాణా కోసం రూ.1,000 చెల్లించాల్సి వస్తున్నదని మాకవరపాలేనికి చెందిన ఓ రైతు తెలిపారు. మొత్తం మీద వరినారు నాటేదశకు పెరిగే వరకు రూ.4 వేలు ఖర్చయ్యిందని, కనీసస్థాయిలో కూడా వర్షం పడకపోవడంతో అదనపు భారం పడుతున్నదని వాపోయారు. ఏదోలా శ్రమించి వరినారును కాపాడుకున్నామని, రానున్న వారం, పది రోజుల్లో పొలాలను దమ్ముపట్టే స్థాయిలో వర్షాలు పడకపోయినా, నదుల నుంచి గ్రోయిన్ల ద్వారా కాలువలకు నీరు రాకపోయినా.. వరినారు ముదిరిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతుందని పలువురు రైతులు చెబుతున్నారు.