Share News

అన్నదాతల అగచాట్లు

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:37 AM

వర్షాలు మొహం చాటేయడంతో వరినారును కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. ట్యాంకర్లను నీటిని కొనుగోలు చేసి, నారుమడులను తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్నదాతల అగచాట్లు
ట్యాంకర్‌తో నీరు తెచ్చి వరి నారుమడిని తడుపుకుంటున్న రైతులు

వరినారుమడిని కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు

ఒక్కో ట్రిప్పునకు రూ.1,000 నుంచి రూ.1,500 ఖర్చు

మాకవరపాలెం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వర్షాలు మొహం చాటేయడంతో వరినారును కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. ట్యాంకర్లను నీటిని కొనుగోలు చేసి, నారుమడులను తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలాఖరులో మండలంలోని మాకవరపాలెం, తామరం, కొండలఅగ్రహారం, బయ్యవరం, గిడుతూరు, నారాయణరాజుపేట గ్రామాల్లో మోస్తరు వర్షం పడడంతో కొంతమంది రైతులు నారుమడులను సిద్ధంచేసుకొని విత్తనాలు చల్లారు. తరువాత ఒకటి, రెండుసార్లు జల్లులు తప్ప పెద్ద వర్షం పడలేదు. మరోవైపు ఎండ మండిపోతుండడంతో నారుమడులు బీటలువారి నారు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. చెరువుల్లో సైతం నీరు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి వరినారుమడులను తడుపుకుంటున్నారు. దూరాన్నిబట్టి ట్యాంకర్‌ నీటికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు చెల్లించాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు. ఇప్పటికైతే నీటిని కొనుగోలు చేసి వరినారును కాపాడుకుంటున్నామని, నాట్లు వేసే సమయానికి పొలాలను దమ్ముపట్టడానికి నీరు లేకపోతే వరినారు వృథా అవుతుందని రైతులు వాపోతున్నారు. వారం, పది రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:37 AM