Share News

మూడు నెలల్లో ప్లాంటు పట్టాలెక్కాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:43 AM

స్టీల్‌ప్లాంటును మూడు నెలల్లో పట్టాలపైకి తీసుకువచ్చి సక్రమంగా, నిబంధనల ప్రకారం నడపాలని అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఏజెన్సీలను నూతన సీఎండీ ప్రభాకర్‌ ఆదేశించారు.

మూడు నెలల్లో ప్లాంటు పట్టాలెక్కాలి

నేను 18 గంటలు పనిచేస్తా..., మీరు 12 గంటలు చేయండి

అధికారులు, ఉద్యోగులతో స్టీల్‌ప్లాంటు నూతన సీఎండీ ప్రభాకర్‌

ఉద్యోగులకు సెలవులు/అనుమతులు ఇవ్వొద్దని విభాగాధిపతులకు ఆదేశం

రోజుకు మూడుసార్లు సమీక్ష

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటును మూడు నెలల్లో పట్టాలపైకి తీసుకువచ్చి సక్రమంగా, నిబంధనల ప్రకారం నడపాలని అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఏజెన్సీలను నూతన సీఎండీ ప్రభాకర్‌ ఆదేశించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులకు పని గంటల విషయంలో స్పష్టత ఇచ్చారు. తాను రోజుకు 18 గంటలు పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చానని, రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు. ప్లాంటులో ఉద్యోగులంతా 12 గంటలు పనిచేయాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్లాంటును గట్టెక్కించాలనేదే తన లక్ష్యమన్నారు. ఇవి వేధింపులు, కక్ష సాధింపులు కానే కాదని స్పష్టంచేశారు. దీనిని సానుకూలంగానే చూడాలన్నారు. ఇకపై ఉద్యోగులకు అనారోగ్యానికి సంబంధించి తప్పితే ఇతర సెలవులు, అనుమతులు ఇవ్వొద్దని విభాగాధిపతులకు ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 10 గంటలకు విభాగాధిపతులతో సమీక్షిస్తానని, ప్లాంటులో ఆ రోజు జరిగిన అన్ని అంశాలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు ఆదేశాలు

ప్లాంటులో గత ఏడాది ఐదు వేల మందికి పైగా కాంట్రాక్టు వర్కర్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అనేక విభాగాల నిర్వహణను ఏజెన్సీలకు అప్పగించారు. వారు కూడా కాంట్రాక్టు వర్కర్లతోనే పని చేయిస్తున్నారు. చాలామంది సాయంత్రం ఐదు గంటలయ్యేసరికి మెయిన్‌గేట్‌ వద్ద గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారని, ఇకపై అలా ఉండడానికి వీల్లేదని ఆదేశించారు. పనిగంటలు ముగిసిన తరువాత మాత్రమే విభాగం నుంచి బయటకు రావాలని, అంతకు ముందే వస్తే వారిపై చర్యలు ఉంటాయన్నారు. మెయిన్‌గేటు ఉదయం 8.45 గంటలకు మూసేస్తారని, అంతా 8.30 గంటలకల్లా లోపల ఉండాలని స్పష్టంచేశారు. సుమారుగా రెండు వేల మంది కాంట్రాక్టు వర్కర్ల పనితీరు బాగా లేదని, మరోసారి సమీక్షించి వారిపై నిర్ణయం తీసుకోవాలని ఆ విభాగాధిపతులకు ఆదేశించారు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తారని, ఎటువంటి లోపాలు బయటపడినా వేటు తప్పదని హెచ్చరించారు.

Updated Date - May 17 , 2026 | 12:43 AM