పెట్రో బాదుడు
ABN , Publish Date - May 16 , 2026 | 12:45 AM
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసింది. ప్రతిపక్షాల మాటను నిజం చేసింది.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు
పరిశ్రమల డీజిల్‌పై లీటరుకు రూ.5...
ఇది ఆరంభమే...
దశలవారీగా మరింత పెంపు
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసింది. ప్రతిపక్షాల మాటను నిజం చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే రేట్లు పెంచుతారని ప్రతిపక్షాలు పదేపదే పేర్కొన్నాయి. వాటిని ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు. అటువంటిదేమీ ఉండదని ప్రకటనలు జారీచేశారు. కానీ పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు ఇప్పట్లో సర్దుమణిగేలా లేకపోవడం, ఇటు ఆయిల్ కంపెనీలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతుండడంతో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం గురువారం అర్ధరాత్రే ప్రకటించింది.
విశాఖ జిల్లాలో లీటరు పెట్రోల్‌పై రూ.3.28, డీజిల్‌పై రూ.3.14 పెరగనున్నది. పరిశ్రమలకు ఉపయోగించే డీజిల్‌పై లీటరుకు రూ.5 పెంచింది. ప్రస్తుతం ఆ డీజిల్ ధర రూ.156 ఉండగా, రూ.161 చేసింది. అయితే ఈ పెంపు ఇక్కడితో ఆగదని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయిల్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల పెంపుపై ప్రజా స్పందన చూసి, దశల వారీగా ఇంకా పెంచుతారని అంటున్నారు.
రవాణా వ్యవస్థపై భారం
నగరంలో అత్యధిక ఆటోలు పెట్రోల్‌తోనే నడుస్తున్నాయి. రోజుకు కనీసం పది లీటర్లు అయినా ఒక్కో ఆటో వినియోగిస్తుంది. ఈ లెక్కన ప్రతి ఆటోపై రోజుకు రూ.33 భారం పడుతుంది. ఇలాంటి ఆటోలు 30 వేలకు పైగానే ఉన్నాయి. ఈ పరిణామంతో వారంతా చార్జీలు పెంచే అవకాశం ఉంది. ర్యాపిడో, ఊబర్‌లు కూడా రేట్లు పెంచేస్తాయి. తద్వారా వాహనాలు ఉన్నవారే కాకుండా, వాటిపై ప్రయాణం చేసే వారు కూడా ఈ భారం మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సరకు రవాణా వ్యవస్థ మొత్తం డీజిల్‌పైనే ఆధారపడి ఉంది. వ్యాన్లు, మినీ లారీలు నగరంలో వందల సంఖ్యలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయి. వాటి కిరాయి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. టూర్స్, ట్రావెల్స్ సంగతి సరేసరి. వారు కూడా ధరలు పెంచడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే పెరిగిన రేట్లతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమలపై డీజిల్‌కు మరో రూ.5 భారం మోపారు. ఈ పరిస్థితుల్లో కర్మాగారాలు నడపలేమని కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ప్రతినిధులు వాపోతున్నారు. ఎంతో కొంత రాయితీ, మినహాయింపు ఇస్తే తమ ముందుకు వెళ్లలేమని చెబుతున్నారు. ఈ ధరల పెంపు మొత్తం అన్ని వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
పేద, మధ్య తరగతిపై భారం
సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పడంతో ఇప్పట్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం లేదనుకున్నా. కానీ, రాత్రికి రాత్రి హఠాత్తుగా పెంచేశారు. పెరిగిన ధరలు పేద, మధ్య తరగతిపై ప్రభావం చూపుతాయి. నేను ఉద్యోగం నిమిత్తం అనకాపల్లి నుంచి వస్తుంటాను. పెట్రోల్ రేటు పెంపుతో ఖర్చు మరింత ఎక్కువవుతుంది.
-చొప్ప వెంకటేష్, ప్రైవేటు ఉద్యోగి, అనకాపల్లి
పాత ధర కొత్త ధర
పెట్రోల్ రూ.108.35, రూ.111.63
డీజిల్ రూ.96.22 రూ.99.36
-
రోజుకు రూ.35 లక్షల భారం
నెలకు రూ.10.5 కోట్లు
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర నిర్ణయంతో విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ.111.63కు, డీజిల్ రూ.99.36కు చేరింది. లీటరు పెట్రోల్‌పై రూ.3.28 పైసలు, డీజిల్‌పై రూ.3.14 పైసలు పెరిగింది. గురువారం రాత్రి వరకు నగరంలో పెట్రోల్ రూ.108.35, డీజిల్ రూ.96.22కు విక్రయించారు. నగరం, పరిసరాల్లో 121 పెట్రోల్/డీజిల్ బంకులు ఉన్నాయి. సగటున హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ బంకుల్లో ప్రతిరోజు 385 కిలోలీటర్ల పెట్రోల్, 710 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ధరల మేరకు పెట్రోల్ వినియోగదారులపై రోజుకు రూ. 12.62 లక్షలు, డీజిల్ వినియోగదారులపై రూ 22.29 లక్షలు...మొత్తం రూ.34.91 లక్షల భారం వాహనదారులపై భారం పడుతుంది. నెలకు రూ.10.5 కోట్లు.
ఆర్టీసీకి డీజిల్ దెబ్బ
రీజియన్‌లో 710 బస్సులు
రోజుకు రూ.1,38,160 అదనపు భారం
ఏడాదికి రూ.5.04 కోట్లు
ద్వారకా బస్‌స్టేషన్, మే 15 (ఆంధ్రజ్యోతి):
ఇంధన సంక్షోభం ఆర్టీసీపై కూడా ప్రభావం చూపనున్నది. సంస్థకు డీజిల్ సరఫరా చేస్తున్న చమురు సంస్థలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు లీటరు డీజిల్‌పై రూ.3.14 పెంచేశాయి. ఈ ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. గురువారం అర్ధరాత్రి వరకు 90 రూపాయలున్న డీజిల్ ధర తరువాత రూ.93.14కు పెరిగింది. విశాఖ రీజియన్‌లో 710 బస్సులు తిరిగేందుకు రోజుకు 44,000 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. అంటే పెంపు వల్ల రోజుకు అదనంగా రూ.1,38,160 భారం పడుతుంది. ఏడాదికి రూ.5.04 కోట్లు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డీజిల్ ధర పెంపు వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.