Share News

పేటను వీడని చెత్త సమస్య

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:31 AM

పంచాయతీ పాలకులు మారుతున్నారే తప్ప పాయకరావుపేటను పట్టిన చెత్త సమస్యకు పరిష్కారం మాత్రం లభించడంలేదు.

పేటను వీడని చెత్త సమస్య

డంపింగ్‌ యార్డులేకపోవడంతో ఖాళీ స్థలాల్లో పారబోత

నిరుపయోగంగా మారిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం

పంచాయతీకి ఆర్ధిక భారంగా మారిన జిందాల్‌కు చెత్త తరలింపు

పాయకరావుపేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీ పాలకులు మారుతున్నారే తప్ప పాయకరావుపేటను పట్టిన చెత్త సమస్యకు పరిష్కారం మాత్రం లభించడంలేదు. ఒకప్పుడు వందల ఎకరాల ప్రభుత్వ భూములున్న పట్టణంలో... ప్రస్తుతం డంపింగ్‌ యార్డుకి రెండు ఎకరాలు కూడా మిగలలేదు. దీంతో పట్టణంలో రోజూ సేకరిస్తున్న చెత్తను పలుచోట్ల ఖాళీ స్థలాలతోపాటు తాండవ నది ఒడ్డున డంపింగ్‌ చేస్తున్నారు.

పాయకరావుపేట పట్టణంలో దాదాపు ఎనిమిది వేల కుటుంబాలకు చెందిన 30 వేలపైచిలుకు జనాభా నివసిస్తున్నారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది రోజు వీధుల్లో చెత్తను సేకరించి తాండవ నది ఒడ్డున వేసేవారు. ఇది గుట్టల మాదిరిగాపేరుకుపోయినప్పుడల్లా నిప్పు పెట్టి దహనం చేసేవారు. దీనివల్ల కాలుష్య సమస్య పెరిగిపోయింది. గత తెలుగుదేశం హయాంలో 2018వ సంవత్సరంలో సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేసి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. పట్టణంలోని వీధులతోపాటు ఇళ్ల నుంచి కూడా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఈ కేంద్రానికి తరించాలన్నది ప్రధాన ఉద్దేశం. చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర నిర్వహణ కోసం గ్రీన్‌ అంబాసిడర్లను (పారిశుధ్య సిబ్బంది)ను నియమించారు. ఆరంభంలో ఈ కేంద్రాన్ని బాగానే నిర్వహించారు. తరువాత అధికారంలోకి వచ్చి వైసీపీ ప్రభుత్వం... గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు మానేశారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది వీధుల్లో మాత్రమే చెత్తను సేకరించి శ్మశానవాటిక వద్ద ఖాళీ స్థలంతోపాటు, పట్టణంలో ఖాళీ ప్రదేశాలు, తాండవ నది ఒడ్డున పడేస్తున్నారు.

మూన్నాళ్ల ముచ్చటగా జిందాల్‌కు చెత్త తరలింపు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో సేకరించిన చెత్తను టీప్పర్లలో లోడ్‌ చేయించి పరవాడ వద్ద ఉన్న జిందాల్‌ పవర్‌ ప్లాంట్‌కు తరలించడం మొదలుపెట్టారు. ఒక్కో ట్రిప్పునకు సుమారు రూ.15 వేల వరకు కిరాయి అతుండడంతో పంచాయతీకి ఆ స్థాయిలో నిధులు, ఆర్థిక వనరులు లేకపోవడంతో చెత్త తరలింపును ఆపేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. శ్మశానవాటికను ఆనుకుని ఉన్న స్థలంలో పేరుకుపోయిన చెత్తను పందులు, కుక్కలు చిందరవందర చేస్తున్నాయి. దీంతో పాయకరావుపేట నుంచి అరట్లకోట, మంగవరం, గోపాలపట్నం, పెంటకోట, సత్యవరం, ఎంఎస్‌.పేట తదితర గ్రామాలకు రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా చెత్త సమస్యపై పంచాయతీ కార్యదర్శి శివరామంను వివరణ కోరగా... పంచాయతీలో తగినన్ని నిధులు లేకపోవడంతో జిందాల్‌కు చెత్తను తరలించలేకపోతున్నామని, శ్మశానవాటిక వద్ద రోడ్డుపైకి చెత్త రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 01:31 AM