ఉద్యానవనం అవినీతిమయం!
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:11 AM
జీవీఎంసీ ఉద్యానవన (హార్టికల్చర్) విభాగం అవినీతికి కేంద్రంగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది...కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయిపోయారు. ఆ విషయాన్ని అలా ఉంచితే నిబంధనలను అతిక్రమించి చెట్లు తొలగించేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఎక్కడైనా ఇంటికి లేదా దుకాణానికి చెట్టు అడ్డుగా ఉందని దానిని తొలగించేయాలనుకుంటే చట్టం అనుమతించదు.
గాడి తప్పిన జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం
కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
పచ్చదనం నిర్వహణ సరిగా లేకున్నా
పూర్తి బిల్లులు చెల్లింపు
ప్రతి పనికీ లంచం డిమాండ్ చేస్తున్న కొందరు సిబ్బంది
డబ్బులిస్తే చెట్లు నరికేందుకు కూడా సిద్ధం
ఏసీబీ కానిస్టేబుల్‌నే లంచం డిమాండ్ చేసిన ఓ ఉద్యోగి
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మెమో జారీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఉద్యానవన (హార్టికల్చర్) విభాగం అవినీతికి కేంద్రంగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది...కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయిపోయారు. ఆ విషయాన్ని అలా ఉంచితే నిబంధనలను అతిక్రమించి చెట్లు తొలగించేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఎక్కడైనా ఇంటికి లేదా దుకాణానికి చెట్టు అడ్డుగా ఉందని దానిని తొలగించేయాలనుకుంటే చట్టం అనుమతించదు. చెట్టు కారణంగా బాగా ఇబ్బంది అవుతుందనుకుంటే కేవలం కొమ్మలను మాత్రమే హార్టికల్చర్ విభాగం తొలగించాల్సి ఉంటుంది. అదే రోడ్డు నిర్మాణం లేదా విస్తరణలో చెట్లు అడ్డుగా ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ అనుమతితో వాటిని వేళ్లతో సహా ప్రత్యేక పద్ధతిలో తీసి వేరొకచోట తిరిగి నాటాల్సి ఉంటుంది. అంతేగానీ చెట్టును తొలగించే అధికారం జీవీఎంసీ అధికారులకు కూడా లేదు. కానీ, తాజాగా తమ ఇంటి వద్ద అడ్డుగా ఉన్న చెట్టును తొలగించాలంటూ ఏసీబీలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు హార్టికల్చర్ విభాగం ఉద్యోగికి ఫోన్ చేయగా...రూ.పది వేలు ఇస్తే చేసేస్తామంటూ చెప్పారు.
నగర పరిధిలోని రహదారులు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ఓపెన్ స్పేస్‌లు, కూడళ్లలో పచ్చదనం పెంపు, మొక్కల సంరక్షణ కోసం జీవీఎంసీలో ఉద్యానవన (హార్టికల్చర్) విభాగాన్ని ఏర్పాటుచేశారు. జీవీఎంసీ పరిధిని 120 ప్యాకేజీలుగా విభజించి మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం, కలుపుతీయడంతోపాటు ఎప్పటికప్పుడు కొమ్మలను ట్రిమ్మింగ్ చేయడం, మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షించడం కోసం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొందరు అసలు నిర్వహణ పనులు చేయకుండానే సిబ్బందిని గుప్పిట్లో పెట్టుకుని బిల్లులు తీసుకుంటున్నారు.
ఇదిలావుండగా సకాలంలో నీరు పోయకపోవడం వల్ల మొక్కలు చనిపోతే...వాటి స్థానంలో కొత్తమొక్కలు నాటే బాధ్యతను మరొక కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. అలాంటప్పుడు మొదట ఎంపిక చేసిన కాంట్రాక్టర్ వైఫల్యం కారణంగానే మొక్కలు చనిపోయినందున...కొత్త మొక్కలు నాటేందుకు అయిన వ్యయాన్ని అతడి బిల్లు నుంచి మినహాయించాలి. కానీ పాత కాంట్రాక్టర్ మొక్కలన్నింటినీ పూర్తిగా సంరక్షించినట్టు పూర్తి బిల్లు చెల్లించేస్తున్నారు. మరోవైపు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తమొక్కలు నాటిన కాంట్రాక్టర్‌కు బిల్లు ఇస్తున్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.
ఈ ఏడాది టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు జూన్ ఒకటి నుంచి మొక్కలకు నీరు పెట్టడం, కలుపుతీయడం, ఏపుగా పెరిగిన కొమ్మలను ట్రిమ్మింగ్ చేయడం వంటి పనులను చేపట్టాల్సి ఉంది. అయితే ట్యాంకర్లకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని 15వ తేదీ వరకు పనులు ప్రారంభించలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో కొందరు మొక్కలకు నీరుపోయడం, మొక్కలు లేనిచోట కొత్తవి నాటడం వంటి పనులను ప్రారంభించారు. డివైడర్లు, సెంటర్ మీడియన్లలో మట్టి తొలగింపు పనులు కొందరు ఇంతవరకూ చేపట్టకపోయినా అధికారులు, సిబ్బంది ప్రశ్నించకపోవడం విశేషం. టెండర్లు దక్కించుకుని ఇప్పటికే దాదాపు రెండు నెలలు గడిచిపోయింది. ఈ మూడు, నాలుగు నెలలు అడపాదడపా వర్షాలు పడతాయి కాబట్టి ప్రత్యేకంగా వారు చేసేదేమీ ఉండదు. చివరి ఐదు నెలలు ఏదోవిధంగా అధికారులు, సిబ్బందిని మేనేజ్ చేసి బిల్లులు తీసుకోవచ్చుననే భావనతో కాంట్రాక్టర్లు ఉన్నారు. హార్టికల్చర్ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది కలిసి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేస్తున్న అవినీతిపై పత్రికల్లో గత కొంతకాలంగా వరుస కథనాలు వెలువడుతున్నాయి. వీటిపై స్పందించిన ఏసీబీ అధికారులు హార్టికల్చర్ విభాగానికి వెళ్లి టెండర్లు, చేపట్టిన పనులు, చేసిన బిల్లులకు సంబంధించిన వివరాలను సేకరించారు. అయినప్పటికీ ఆ విభాగాన్ని గాడిలో పెట్టాలన్న ధ్యాస ఉన్నతాధికారుల్లో కనిపించడం లేదు.
ఇలాంటి తరుణంలో ఆ విభాగంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ విభాగంలో అసలు ఏం జరుగుతోందనే దానిపై చర్చ మొదలైంది. హార్టికల్చర్‌పై వస్తున్న ఆరోపణలకు సంబంధించిన సమాచారం కోసం ఇటీవల పలుమార్లు ఆ విభాగానికి వెళ్లిన ఏసీబీ కానిస్టేబుల్ ఒకరు అక్కడి సిబ్బందితో ఏర్పడిన పరిచయంతో తమ ఇంటి ముందున్న ఒక చెట్టును తొలగించాలని ఫోన్‌లో కోరారు. అయితే ఏసీబీ కానిస్టేబుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన హార్టికల్చర్ ఉద్యోగి ఒకరు ఆ చెట్టును తొలగించాలంటే ముందుగా దానిని చంపాల్సి ఉంటుందని, అందుకోసం ఒక రసాయనాన్ని చెట్టు మొదలులో పోయాలని సూచించారు. ఆ చెట్టును తొలగించేందుకు రూ.పది వేలు డిమాండ్ చేశారు. తాను ఏసీబీ కానిస్టేబుల్‌నని అవతలి వ్యక్తి గుర్తుచేసినప్పటికీ ‘మీరు ఎవరైతే ఏంటి’...అని ఆ ఉద్యోగి సమాధానమిచ్చాడు. ఈ ఉదంతం ఆ విభాగంలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో తేటతెల్లం చేసింది. దీనిపై సదరు కానిస్టేబుల్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో...ఫోన్‌నంబర్ ఆధారంగా ఉద్యోగి ఎవరనేది గుర్తించిన అధికారులు అతడిని ఎందుకు సస్పెండ్ చేయకూడదో సమాధానం ఇవ్వాలని మెమో జారీచేశారు. హార్టికల్చర్ విభాగం ఎప్పుడో గాడి తప్పిందని, ఇప్పటికైనా దానిని సరిదిద్దే బాధ్యతను ఉన్నతాధికారులు తీసుకోవాలని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు కోరుతున్నారు.