Share News

చెరువు గట్టే ఏకైక మార్గం

ABN , Publish Date - May 20 , 2026 | 12:32 AM

అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణంలో అధికారులకు ముందు చూపు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో చెరువు గట్టు మీదుగానే అతి భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి.

చెరువు గట్టే ఏకైక మార్గం

- అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణంతో రాకపోకలు బంద్‌

- కూనిశెట్టి బలిజవానిచెరువు గట్టు పైనుంచి భారీ వాహనాలు సైతం రాకపోకలు

- దెబ్బతింటున్న గట్టు

- దుమ్ము, ధూళితో కాలనీ వాసుల అవస్థలు

- పట్టించుకోని అధికారులు

అచ్యుతాపురం, మే 19 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణంలో అధికారులకు ముందు చూపు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో చెరువు గట్టు మీదుగానే అతి భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి.

అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పుడు ఒక పక్క పనులు జరిగితే, మరో పక్క నుంచి వాహనాలు వెళ్లేవి. ఇప్పుడు పిల్లర్లపై గడ్డర్లు ఎక్కిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీని వలన ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందిని తీసుకువెళ్లే వందల కొద్ది బస్సులతో పాటు కర్మాగారాలకు ముడిసరుకు, భారీ యంత్రాలు తెచ్చే వాహనాలు, అలాగే సెజ్‌ కర్మాగారాల్లో ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మండల కాంప్లెక్స్‌ మీదుగా తేలికపాటి వాహనాలతో పాటు బస్సులు వెళ్లేవి. మండల కాంప్లెక్స్‌కి మండలం నలుమూలల నుంచి వచ్చే ప్రజలతో పాటు ఇరుకురోడ్డు కావడంతో తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. కాగా జంగులూరు జంక్షన్‌, మడుతూరు రోడ్డు మధ్యలో గల కూనిశెట్టి బలిజవాని చెరువు గట్టు పైనుంచి స్థానికులు రాకపోకలు కొనసాగించేవారు. ప్రస్తుతం ఇదే అందరికీ ప్రధాన రహదారిగా మారింది. భారీ నుంచి అతిభారీ వాహనాలతో పాటు బస్సులు కూడా ఈ మార్గం గుండానే వెళుతున్నాయి. దీని వలన ఈ చెరువు గట్టు పూర్తిగా పాడైపోయింది. వందల సంఖ్యలో వాహనాలు చెరువుగట్టుపై వెళుతున్నందున చెరువు గట్టు అంతా బూడిదగా మారిపోయింది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించనంతగా ధూళి వస్తోంది. చెరువుగట్టు పక్కనే ఉన్న ముసలమ్మ కాలనీ, ఇందిరమ్మ కాలనీలోని ప్రజలు ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక చెరువు గట్టుపై నిరంతరాయంగా వాహన రాకపోకలు జరుగుతుండడంతో గోతులమయమైంది. అధికారులు కనీసం గోతులు పూడ్చడం, ధూళి రాకుండా నీటిని ట్యాంకర్ల ద్వారా చల్లటం వంటి పనులు చేపట్టినా బాగుండేదని పలువురు అంటున్నారు.

Updated Date - May 20 , 2026 | 12:32 AM