Share News

కొండపోరంబోకు కబ్జా

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:35 AM

జిరాయితీ భూములను కొనుగోలు చేయడం, అనంతరం వాటిని ఆనుకొని వున్న ప్రభుత్వ భూములు, కొండపోరంబోకు, వాగులు, గెడ్డలను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఈ తరహా అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు, రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా వుంటున్నాయి. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండలంలోని పైడిపాల రెవెన్యూ లచ్చన్నపాలెంలో తాజాగా ఈ తరహా భూ కబ్జా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

కొండపోరంబోకు కబ్జా
కుసర్లపూడి పరిధిలో కొండపోరంబోకు భూమిని ఆక్రమించి చదును చేసిన దృశ్యం

కుసర్లపూడిలో నాలుగు ఎకరాలు ఆక్రమణ

యంత్రాలతో చదును పనులు

ముందస్తు వ్యూహంతో పక్కనే వున్న డి.పట్టా, జిరాయితీ భూములు కొనుగోలు

ఆక్రమించిన కొండపోరంబోకు భూమి విలువ రూ.కోటి పైమాటే

పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

మాకవరపాలెం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

జిరాయితీ భూములను కొనుగోలు చేయడం, అనంతరం వాటిని ఆనుకొని వున్న ప్రభుత్వ భూములు, కొండపోరంబోకు, వాగులు, గెడ్డలను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఈ తరహా అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు, రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా వుంటున్నాయి. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండలంలోని పైడిపాల రెవెన్యూ లచ్చన్నపాలెంలో తాజాగా ఈ తరహా భూ కబ్జా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

నర్సీపట్నం- తాళ్లపాలెం ప్రధాన రహదారిపై మాకవరపాలెం మండలంలో వున్న ఒక గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి వ్యవసాయంతోపాటు వివిధ రకాల వ్యాపారాలు చేస్తుంటారు. వీరు కొంతకాలం క్రితం పైడిపాల రెవెన్యూ పరిధిలోని లచ్చన్నపాలెం ఆనుకొని సుమారు 20 ఎకరాల జిరాయితీ భూములను, ఇదే సమయంలో ఈ భూములను ఆనుకొని రోలుగుంట మండలం కుసర్లపూడిలో కొండను ఆనుకొని దాదాపు ఏడు ఎకరాల డి.పట్టా భూములను కొనుగోలు చేశారు. ఇంతవరకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వీరు డి.పట్టా భూములను ఆనుకొని వున్న కొండపోరంబోకు భూమిని కబ్జా చేశారు. సుమారు 50 అడుగుల వెడల్పు, 250 అడుగుల పొడవున యంత్రాలతో తవ్వేసి తమ భూములతోపాటు చదును చేశారు. ఆక్రమించిన కొండపోరంబోకు భూమి మూడు, నాలుగు ఎకరాలు వుంటుందని అంచనా. ఇక్కడ ఎకరా రూ.20-25 లక్షలు పలుకున్నది. కుసర్లపూడిలో ఆక్రమించిన కొండపోరంబోకు భూమి విలువ సుమారు కోటి రూపాయలు వుంటుందని స్థానికులు చెబుతున్నారు. కొండపోరంబోకు భూమిని యంత్రాలతో తవ్వేసి, తమ భూముల్లో కలిపేసుకుంటున్నప్పటికీ రోలుగుంట మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

Updated Date - Jan 03 , 2026 | 12:35 AM