Share News

వార్డులు 150 చేయాల్సిందే

ABN , Publish Date - May 20 , 2026 | 12:31 AM

జీవీఎంసీలో వార్డుల పునర్విభజనపై తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వార్డులు 150 చేయాల్సిందే

టీడీపీ డిమాండ్‌

ఇప్పటికే సీఎంను కోరిన నేతలు

పెరిగిన జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని విజ్ఞప్తి

భారీగా అభ్యంతరాలు తెలియజేయాలని నిర్ణయం

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలో వార్డుల పునర్విభజనపై తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో జోన్‌ల విభజన అశాస్ర్తీయంగా చేశారని, ఇప్పుడు వార్డుల విషయంలో కూడా అదే మాదిరిగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కొందరు నేతలు జీవీఎంసీకి భారీగా అభ్యంతరాలు తెలపాలని భావిస్తుండగా, మరికొందరు సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు.

రెండు వారాల క్రితం అమరావతిలో సీఎం సమక్షంలో జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగినప్పుడు జీవీఎంసీలో వార్డుల సంఖ్యను 150కు పెంచాలని కోరారు. విశాఖ నగరానికి వలసలు పెరిగినందున ప్రస్తుతం జనాభా 25 లక్షలు దాటి ఉంటుందని, అందువల్ల వార్డుల సంఖ్య 150కు పెంచాలని సీఎంను కోరగా ఆయన అంగీకరించారు. అయితే 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకుని రెండు రోజుల క్రితం 98 వార్డులను 120 వార్డులకు పెంచుతూ ముసాయిదా విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమ అభిప్రాయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులు నిర్ణయించారు.

రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యేలతో సమావేశం

పల్లా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే

జీవీఎంసీ అధికారులు చేపట్టిన విభజన అసంతృప్తికి గురిచేసింది. నగరంలో పెరిగిన జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల సంఖ్య 150కు పెంచాల్సిందే. వార్డుల విభజనపై ఈ ఏడాది మార్చి 24న ఇచ్చిన జీవో ప్రకారం 15 లక్షలు జనాభా దాటిన నగరంలో వార్డుల సంఖ్యను 120కు పెంచాలి. అటువంటప్పుడు 26 లక్షల వరకు జనాభా ఉన్న విశాఖలో వార్డుల సంఖ్య 150కు పెంచాల్సి ఉంది. వార్డుల విభజన శాస్త్రీయ పద్ధతిలో చేయలేదు. గతంలో జోన్‌ల విభజన సమయంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మూడు జోన్‌లలో కలిపారు. దువ్వాడను తీసుకువెళ్లి పెందుర్తి జోన్‌లో విలీనం చేయడంతో పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయి. అదే మాదిరిగా వార్డుల విభజనకు శాస్త్రీయత లేదు. రెండు, మూడు రోజుల్లో జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తాం. వార్డుల విభజనపై భారీగా అభ్యంతరాలు ఇవ్వాలని ప్రజలు, నాయకులు, మాజీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చాం.

పెరిగిన జనాభాను ప్రామాణికంగా తీసుకోవాలి

చోడే వెంకట పట్టాభి, అధ్యక్షుడు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం

ప్రభుత్వ జీవో ప్రకారం వార్డుకు 15 వేలు జనాభాను ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే నగరంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న వార్డుల్లో జనాభా తాజా లెక్కల ప్రకారం 18 వేల వరకు ఉంటారు. అటువంటప్పుడు పాలనలో ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం నగర జనాభా 26 లక్షల వరకు ఉంటుందని అంచనా. అందువల్ల వార్డుల సంఖ్యను 150కు పెంచాలి. దీనిపై వారం రోజులపాటు అభ్యంతరాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు, నాయకులు అభ్యంతరాలు ఇవ్వాలి.

Updated Date - May 20 , 2026 | 12:31 AM