Share News

సర్వాంగ సుందరంగా నూకాంబిక ఆలయం

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:02 AM

సుమారు మూడేళ్లుగా పునర్నిర్మాణంలో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.58 గంటలకు ప్రత్యేక పూజలతో కార్యక్రమం జరగనుంది.

సర్వాంగ సుందరంగా నూకాంబిక ఆలయం

నేడు పునఃప్రారంభం

ఉదయం 10.58 గంటలకు ప్రత్యేక పూజలు

ఆ తరువాత భక్తులకు మూలవిరాట్‌ దర్శనం

హాజరుకానున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత, ఇన్‌చార్జి మంత్రి రవీంద్ర

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కొణతాల

అనకాపల్లి టౌన్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

సుమారు మూడేళ్లుగా పునర్నిర్మాణంలో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.58 గంటలకు ప్రత్యేక పూజలతో కార్యక్రమం జరగనుంది. అనంతరం భక్తులకు మూలవిరాట్‌ దర్శనం లభించనుంది. కార్యక్రమానికి శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం ఆలయాన్ని సందర్శించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాస్తవానికి 2018లో అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రూ.2.5 కోట్లతో రాజగోపురాన్ని నిర్మించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల పాటు పనులపై దృష్టిపెట్టని అప్పటి పాలకులు 2023లో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఆ తరువాత డిసెంబరు వరకు పనులు చేపట్టలేదు. తరువాత ప్రారంభించినా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొణతాల రామకృష్ణ ఆలయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు. ఎప్పటికప్పుడు పనులు పరిశీలించి వేగవంతానికి సలహాలిచ్చారు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం మార్చి 8వ తేదీకి పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌, పాలకవర్గసభ్యులు సహకరించారు.

సువిశాలంగా ఆలయం

సుమారు రూ.12.5 కోట్లతో పునర్నిర్మించిన ఆలయం గతంలో పోల్చితే విశాలంగా మారింది. భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అమ్మవార్ల విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గతంలో ఆలయం పొడవు 98 అడుగులు, వెడల్పు 60 అడుగులు ఉండేది. పునర్నిర్మాణంలో భాగంగా పొడవు 175 అడుగులు, వెడల్పు 94 అడుగులకు పెంచారు. గర్భాలయం పొడవు, వెడల్పు 14 అడుగుల నుంచి 18 అడుగులకు పెంచారు. అంతరాలయం పొడవు 12 అడుగులు, వెడల్పు 14 అడుగులకు ఉండగా ప్రస్తుతం పొడవు 18 అడుగులు, వెడల్పు 15 అడుగులకు చేరింది. అనివెట్టి మండపం పొడవు 27 అడుగులు, వెడల్పు తొమ్మిది అడుగులు ఉండగా ప్రస్తుతం పొడవు 55 అడుగులు, వెడల్పు 45 అడుగులకు విస్తరించారు. ప్రైవేటు కంపెనీల సీఎస్‌ఆర్‌ నిధులతో భక్తులకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. ఆలయం చుట్టూ మాడవీధులను లారస్‌ కంపెనీ అందించిన నిధులతో తీర్చిదిద్దారు.

అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదివారం పోలీసు అధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రాంకీ, జిల్లా దేవదాయశాఖ అధికారి సుధారాణి, జీవీఎంసీ అధికారులు, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 02:02 AM