పెందుర్తి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:36 AM
పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి (వైసీపీ)పై కూటమి నాయకులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
తొమ్మిది మందికిగాను 8 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు
చేతులు ఎత్తి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన ఏడుగురు సభ్యులు
పినగాడి ఎంపీటీసీ (వైసీపీ) దాడి వరలక్ష్మి గైర్హాజరు
పెందుర్తి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి (వైసీపీ)పై కూటమి నాయకులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల పరిషత్ పరిఽధిలో గల ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీవో కార్యాలయంలో జనవరి 19న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేశారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో సుధాసాగర్ సోమవారం పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా ఒకరు గైర్హాజరయ్యారు. పినగాడి ఎంపీటీసీ సభ్యురాలు దాడి వరలక్ష్మి (వైసీపీ) గైర్హాజరైనా, కోరం సరిపోవడంతో ఓటింగ్ చేపడదామని సభ్యులకు ఆర్డీవో తెలపగా, వారు సమ్మతించడంతో బల పరీక్ష నిర్వహించారు. ఎంపీపీ మధుపాడ నాగమణి హాజరై అవిశ్వాస బలపరీక్షను ఎదుర్కొన్నారు. తొలుత సమావేశానికి హాజరైన ఎంపీటీసీ సభ్యుల వివరాలు తీసుకుని పుస్తకంలో వారి సంతకాలు తీసుకున్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నవారు చేతులు ఎత్తాలని సూచించారు. దీంతో ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు గొల్లవిల్లి రమణ (సరిపల్లి), చిరికి దేవుడు (గొరపల్లి), నందవరపు అప్పలరాజు (పెదగాడి), గండి హిమబిందు (రాంపురం), సైపురాజు స్వప్న (వాలిమెరక), ముదపాక దేవి (రాజయ్యపేట), గండ్రెడ్డి మాలతి (గుర్రమ్మపాలెం) చేతులు ఎత్తి ఎంపీపీపై అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో ఎస్.ఆర్.పురం ఎంపీటీసీ సభ్యురాలు మధుపాడ నాగమణి ఎంపీపీ పదవిని కోల్పోయారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నూతన ఎంపీపీ ఎన్నికకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో గుండు అప్పలరాజు తెలిపారు. పరిషత్ పర్యవేక్షణ అధికారి కొల్లి వెంకటరావు ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. ఉప తహశీల్దార్ కిశోర్ వివరాలు నమోదు చేశారు. అవిశ్వాస సమావేశానికి అధికారులు, ఎంపీటీసీ సభ్యులు తప్ప ఇతరులను కార్యాలయంలోకి అనుమతించలేదు. వెబ్ కాస్ట్, వీడియోగ్రఫీలో ఈ ప్రక్రియను రికార్డు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కేవీ సతీశ్‌కుమార్ పటిష్ఠ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
సిటీలో ఐపీఎల్ మ్యాచ్‌లు?
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా ఏసీఏ-వీడీసీఏ స్టేడియం
రెండు మ్యాచ్‌లు కేటాయించే అవకాశం
విశాఖపట్నం-స్పోర్ట్స్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు విశాఖలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తోంది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా చేసుకుని రెండు మ్యాచ్‌లు ఆడింది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. అలాగే 2024లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకుని చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లు ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది. విశాఖలో విజయ శాతం ఆశించిన స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా రెండు మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని హోం గ్రౌండ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.