విశాఖ యువతకు నౌకాదళమే స్ఫూర్తి
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:17 AM
సాగర తీర నగరమైన విశాఖపట్నంలో పెరుగుతున్న యువతకు భారత నౌకాదళమే స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఐఎఫ్‌ఆర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అనేవి మన నావికుల విశేష లక్షణాలు
వాటిటి విద్యార్థులు అందిపుచ్చుకోవాలి
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):
సాగర తీర నగరమైన విశాఖపట్నంలో పెరుగుతున్న యువతకు భారత నౌకాదళమే స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆమె ‘ఐఎన్‌ఎస్ సుమేధ’ పై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అనేవి మన నావికుల విశేష లక్షణాలని వివరించారు. వాటిని విశాఖ విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. దేశ సేవలో అహర్నిశలూ శ్రమిస్తున్న నౌకాదళ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. ఆయనకు భారత నౌకాదళాధిపతి దినేశ్ త్రిపాఠి స్వాగతం పలికి వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సతీసమేతేంగా విచ్చేయగా వారికి నేవీ అధికారులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా సతీసమేతంగా వచ్చి అదే రథంలో సమీక్షకు వెళ్లారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఐఎన్‌ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి రథం వెంట సమీక్షకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, తదితరులు పాల్గొన్నారు.
నేడు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
బీచ్ రోడ్డులో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ నిర్వహణ
తొలుత నేవీ విన్యాసాలు
అనంతరం వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కవాతు
ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
నేవీ కుటుంబాలకు ప్రత్యేక గ్యాలరీలు
పాస్‌లన్నీ ప్రజాప్రతినిధులకు...
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):
నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో గురువారం సాయంత్రం రామకృష్ణా బీచ్‌రోడ్డులో ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’’ నిర్వహించనున్నారు. దీనికి ముందు నౌకాదళం తన శక్తిసామర్థ్యాలను నగర ప్రజలకు ప్రదర్శించనున్నది. ఆపరేషన్ డెమోగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో వైమానిక విభాగం ప్రధాన పాత్ర పోషించనుంది. ఇది ముగిసిన తరువాత పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్‌కే బీచ్ వరకూ వివిధ దేశాల ప్రతినిధులు వారి ప్రత్యేక దుస్తులు, అలంకరణలతో కవాతు చేస్తూ వచ్చి అతిథుల ముందు ప్రదర్శన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
లక్షన్నర మంది వస్తారని అంచనా
సిటీ పరేడ్ చూడడానికి నగర ప్రజలు సుమారుగా 1.5 లక్షల మంది వస్తారని నేవీ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్యాలరీలు నిర్మించారు. ప్రత్యేక పాస్‌లు మంజూరు చేశారు. వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు, భద్రతలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.
పాస్‌ల కోసం వెంపర్లాట
సిటీ పరేడ్ చూడడానికి సామాన్య ప్రజలకు ఎక్కడా సీటింగ్ కేటాయించలేదు. పాసులు లేకుండా వచ్చే జనాలంతా తీరంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో నిల్చొని కార్యక్రమాలు చూడాల్సిందే. బీచ్‌రోడ్డులో విగ్రహాల ముందు ఏర్పాటుచేసిన గ్యాలరీలకు పాస్‌లు మంజూరు చేశారు. ఇవి సుమారుగా 25 వేలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ పాస్‌లు ఎవరికి ఇచ్చారో తెలియదు గానీ వీటి కోసం పెద్ద స్థాయిలోనే పైరవీలు జరిగాయి. జిల్లా అధికారులకు అన్నీ ఇచ్చేశామని నేవీ అధికారులు చెబుతుంటే...ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులకే ఇచ్చామని జిల్లా అధికారులు చెబుతున్నారు. నగరంలో దైవ దర్శనమైనా, క్రికెట్ అయినా, నేవీ కార్యక్రమాలైనా పాస్‌ల దగ్గరే వివాదాలు వస్తున్నాయి. అంతా కలిసి వీటిని సామాన్యులకు అందకుండా చేస్తున్నారు. ఇది నేవీ ఉత్సవం కావడంతో నేవీ కుటుంబాల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసుకున్నారు.