కొండపాలెంలో ‘ముచ్చకర్ల’ ఫ్యామిలీదే హవా
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:03 AM
కొండపాలెంలో ‘ముచ్చకర్ల’ ఫ్యామిలీదే హవా
ఆరు దశాబ్దాలుగా సర్పంచ్ పదవి ఆ కుటుంబానిదే
రిజర్వేషన్‌తో మధ్యలో ఒక్క పర్యాయం మినహా.....
తండ్రీకొడుకు మూడేసార్లు ఏకగ్రీవం
ఇద్దరు కోడళ్లు సైతం సర్పంచ్‌లుగా ఎన్నిక
1982 వరకు కాంగ్రెస్.... తరువాత నుంచి టీడీపీ
ప్రస్తుత ఎన్నికల్లో మరో కుమారుడు పోటీ
బుచ్చెయ్యపేట, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ సర్పంచ్ పదవి దశాబ్దాలుగా ఆ కుటుంబం గడపదాటలేదు. గత పర్యాయం వరకు మొత్తం పదిసార్లు ఎన్నికలు జరగ్గా... తొమ్మిదిసార్లు ఆ ఫ్యామిలీ మెంబర్లే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఈ కుటుంబంలో నలుగురు సర్పంచ్‌లుగా పనిచేయగా, వీరిలో తండ్రి, పెద్ద కుమారుడు వరుసగా మూడేసి పర్యాయాలు, పెద్ద కోడలు ఒకసారి ఏకగీవ్రంగా ఎన్నిక కావడం విశేషం. మరో రెండుసార్లు నాలుగో కోడలు గెలిచారు. ఈసారి ఎన్నికల్లో నాలుగో కుమారుడు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. మొత్తం మీదు ఆరు దశాబ్దాలకుపైగా ఈ కుటుంబీకులే సర్పంచులుగా ప్రజాసేవ చేయడం విశేషం.
బుచ్చెయ్యపేట మండలం కొండపాలెం పంచాయతీకి 1958లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. గ్రామానికి చెందిన ముచ్చకర్ల సింహాచలంనాయుడు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరువాత వరుసగా 1964, 1971 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ లేకుండా సర్పంచ్ అయ్యారు. 1981 ఎన్నికల్లో సింహాచలం నాయుడు పెద్దకుమారుడు వీరవెంకట సత్యనారాయణ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో వున్న ఈ కుటుంబం... 1982లో తెలుగుదేశం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరింది. ఇప్పటికీ టీడీపీతోనే వుంది. తరువాత 1988, 1995 ఎన్నికల్లో కూడా వీరవెంకట సత్యనారాయణ ఏగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001 ఎన్నికల్లో సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో వీరవెంకట సత్యనారాయణ భార్య వాణి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006 ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఎస్‌సీలకు రిజర్వు అయ్యింది. దీంతో ముచ్చకర్ల కుటుంబం బలపరిచిన కోనపల్లి వెంకటరమణ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. 2013 ఎన్నికల్లో మహిళలకు రిజర్వు కావడంతో సింహాచలం నాయుడు నాలుగో కుమారుడు వెంకట స్వామినాయుడు భార్య భవానీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2021 ఎన్నికల్లో కూడా ఆమె మరోసారి విజయం సాధించారు. ఈసారిసర్పంచ్ పదవి అన్ రిజర్వుడు కావడంతో వెంకట స్వామి నాయుడు (తాతీలు) పోటీలో వున్నారు. గెలుపు లాంఛనమేనని గ్రామస్థులు చెబుతున్నారు.