ఎమ్మెల్యే వెన్నుపోటు పొడిచారు
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:03 AM
ఎంపీపీగా పోటీ చేసేందుకు వైసీపీ బీఫారం ఇవ్వడానికి పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తన నుంచి రూ.15 లక్షలు తీసుకున్నారని జీకేవీధి-3 ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
- పార్టీ బీఫారం ఇచ్చేందుకు రూ.15 లక్షలు తీసుకున్నారు
- తెర వెనుక రాజకీయం చేసి ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీపీ చేశారు
- పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుపై ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్ ఆరోపణలు
గూడెంకొత్తవీధి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎంపీపీగా పోటీ చేసేందుకు వైసీపీ బీఫారం ఇవ్వడానికి పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తన నుంచి రూ.15 లక్షలు తీసుకున్నారని జీకేవీధి-3 ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవం నుంచి వైసీపీలో కార్యకర్తగా, మండల అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ బీఫారం కోసం అప్పు చేసి మరీ ఎమ్మెల్యేకు రూ.15 లక్షలు ఇచ్చానని చెప్పారు. నగదు తీసుకున్న ఎమ్మెల్యే తెర వెనుక కుల రాజకీయం చేశారన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన లీలాప్రసాద్‌కి మద్దతు ఇచ్చారన్నారు. 18 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 14 మంది వైసీపీకి చెందిన వారే ఉన్నప్పటికి కేవలం ఎమ్మెల్యే కుల రాజకీయం వల్లే తాను ఓటమి పాలయ్యానన్నారు. తన వద్ద తీసుకున్న రూ.15 లక్షలు తక్షణమే ఎమ్మెల్యే తిరిగి ఇవ్వకపోతే పాడేరులో నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ఎంపీటీసీ సభ్యుడి పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోయిన కుమారి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.