ఆకతాయిల ఆగడాలు!
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:11 AM
నగరంలో రౌడీషీటర్లు, ఆకతాయిల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి.
నగరంలో పెచ్చుమీరుతున్న పరిస్థితి
వీధులు, పార్కులు, బస్టాపుల్లో రెచ్చిపోతున్న వైనం
రాత్రి సమయంలో రోడ్లపై విన్యాసాలు
డబ్బుల కోసం బెదిరింపులు, ప్రశ్నిస్తే దాడులు
గంజాయి వాడకమే కారణమని ఆరోపణలు
కొరవడుతున్న పోలీసు నిఘా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రౌడీషీటర్లు, ఆకతాయిల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో కొందరు కాలనీలు, పార్కులు, బస్టాండ్‌లలో రెచ్చిపోతున్నారు. నలుగురైదుగురు ఓచోట చేరి రోడ్డుపక్కన నిల్చొని, వచ్చిపోయే వారిని గేలిచేస్తున్నారు. యువతులు, మహిళలను టీజ్ చేస్తున్నారు. ఎవరైనా ఒంటరిగా బైక్‌తో వెళుతుంటే అటకాయించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ నిఘా లేకపోవడంతోనే రెచ్చిపోతున్నారని, సరైన చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపు తప్పకముందే నివారించే వీలుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కేజీహెచ్ ఓపీ గేటు పక్కనున్న వార్డుబాయ్ కాలనీ నుంచి ఒకరు స్కూటీపై వస్తున్నారు. ఓ యువకుడు సైకిల్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో బైక్‌పై వస్తున్న వ్యక్తి హారన్ కొట్టారు. దాంతో స్కూటీపై ఉన్న వ్యక్తిని సైక్లిస్టు దుర్భాషలాడడమే కాకుండా జేబులో నుంచి చాకు తీసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో స్కూటీమీద ఉన్న వ్యక్తి ప్రాణభయంతో జారుకోవాల్సి వచ్చింది. అలాగే పోర్టు ఆస్పత్రి సమీపంలోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి అర్ధరాత్రి విధులను ముగించుకుని ఆటో కోసం తాటిచెట్లపాలెం జంక్షన్‌కు వెళుతుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అటకాయించి సెల్‌ఫోన్, జేబులో ఉన్న డబ్బులు లాక్కున్నారు. అలాగే పెందుర్తి శివారులో ఒక నిర్మాణ సంస్థలో రాత్రి వేళ వాహనంతో చొరబడి అక్కడున్న ఐరన్‌రాడ్లను ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేయగా, వాచ్‌మన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వీఎంఆర్‌డీఏ సెంట్రల్ పార్కు వద్ద తుప్పల్లో గంజాయిబ్యాచ్‌లు రాత్రివేళ అరాచకం సృష్టిస్తున్నాయని వాకర్స్ ఆరోపిస్తున్నారు. వీధుల్లో కూడా రాత్రి వేళ 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన యవకులు గంజాయి, సిగరెట్లు తాగుతూ హడావిడి చేయడం నిత్యకృత్యమయింది.
నిఘా పెంచకుంటే ఇబ్బందే
నగరంలో ఆకతాయిలు ఇటీవల రెచ్చిపోతున్నారు. వరుస సంఘటనల నేపథ్యంలో వారి ఆగడాలకు ముందుగానే ముకుతాడు వేసేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. లేదంటే ఉన్మాదులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో పోలీసులు రాత్రివేళ బైక్‌లపై పెట్రోలింగ్ చేస్తూ ఆరుబయట మద్యం సేవించేవారు, బైక్‌లతో రోడ్లపై స్టంట్‌లు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ చర్యలు ఆకతాయిల ఆగడాలను అరికట్టాయి. నగర పోలీసులు కూడా అదే తరహాలో బైక్‌లపై పెట్రోలింగ్ చేపట్టి శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నగరంలో రాత్రివేళ రక్షక్ జీపులు, నైట్ పెట్రోలింగ్ ఇన్‌చార్జిల జీపుల్లో పోలీసులు సైరన్ మోగించుకుని రెండు రౌండ్లు తిరిగి, తర్వాత సినిమా థియేటర్లకు వె ళ్లిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆకతాయిలకు అడ్డులేకుండాపోతోందని, వారు రౌడీషీటర్లుగా మారకముందే ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.