మెనూ సక్రమంగా అమలు చేయాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:48 PM
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సూచించారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి
విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షించాలి
కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల తనిఖీ
కొయ్యూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి) విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంతోపాటు పలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మెనూపై ఆరా తీశారు. విద్యా విషయాలపై ప్రశ్నించి మరింత మెరుగ్గా బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టోర్ రూంలను తనిఖీ చేశారు. కస్తూర్బా విద్యాలయంలో వాడుక నీరు, వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేక దోమలు, ఈగల బెడద అధికంగా ఉందని పాఠశాల డిప్యూటీ వార్డెన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. వంట గ్యాస్ సకాలంలో సక్రమంగా సరఫరా జరగడం లేదని, తాగునీటి సమస్య ఉందన్నారు. ఆర్‌వో ప్లాంట్ మరమ్మతులకు గురైందని ఎస్‌టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. మరుగుదొడ్లు సమస్యను ఉపాధ్యాయులు చైర్మన్ దృష్టిలో పెట్టారు. స్టోర్‌రూంలో స్టాక్‌లో వ్యత్యాసాలను గుర్తించి డిప్యూటీ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల-1ను సందర్శించి పదో తరగతి విద్యార్థులను విద్యా విషయాలపై ప్రశ్నించారు. మరుగుదొడ్లు పరిశీలించి పారిశుధ్యం సక్రమంగా చేపట్టించాలని సూచించారు. చైర్మన్ వెంట రాజేంద్రపాలెం ఎంపీటీసీ సభ్యుడు మేడిబోయిన చక్రరావు, తదితర కూటమి నాయకులు ఉన్నారు.