Share News

వసతి గృహాల్లో మెనూ పక్కాగా అమలు చేయాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:40 AM

వసతి గృహాల్లో విద్యార్థులకు అందించాల్సిన మెనూ సక్రమంగా అమలు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి హెచ్చరించారు.

వసతి గృహాల్లో మెనూ పక్కాగా అమలు చేయాలి
పౌర సరఫరాల శాఖ గోదాములో బియ్యాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం

లేకుంటే కఠిన చర్యలు

రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి హెచ్చరిక

మాడుగుల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో విద్యార్థులకు అందించాల్సిన మెనూ సక్రమంగా అమలు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక పౌరసరఫరాల శాఖ గోదామును తనిఖీ చేశారు. బియ్యం బస్తాలు, పప్పు ప్యాకెట్లను తూకం వేసి చూశారు. గోదాము నుంచి వసతి గృహాలకు, రేషన్‌ డిపోలకు ఏ విధంగా, ఏ సమయంలో సరఫరా చేస్తున్నారని గోదాము ఇన్‌చార్జి యడ్ల వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్ట్టికాహారం పక్కదోవ పడుతోందని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించామన్నారు. పలు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన సమయంలో గుడ్ల కొరత, నిల్వలు బయట పడ్డాయన్నారు. అలాగే ఒక్కరే విద్యార్థి ఉంటే ఎక్కువ మంది ఉన్నట్టు హాజరు నమోదు చేసిన విషయం బయట పడిందని తెలిపారు. ఆయన వెంట పౌరసరఫరాల శాఖ అధికారి కేవీఎల్‌ఎంఎన్‌ మూర్తి, డీఎం వెంకటరమణ, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి జీజీఎస్‌ నాగేశ్వరరావు, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ రామచంద్రయ్య, ఫుడ్‌ సేఫ్టీ అధికారి రవికమార్‌ ఉన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:40 AM