Share News

గాడిన పడిన వైద్యం

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:20 PM

స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందుతున్నాయి. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఏరియా ఆస్పత్రిలో కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న మెజారిటీ ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేసింది.

గాడిన పడిన వైద్యం
చింతపల్లి ఏరియా ఆస్పత్రి

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మెరుగైన సేవలు

గిరిజన ప్రాంతంలో వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు చాలా వరకు భర్తీ

ఇతర ఆస్పత్రులకు రిఫరల్స్‌ తగ్గుముఖం

రోజూ 350 నుంచి 400 మందికి ఆరోగ్య పరీక్షలు

చింతపల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందుతున్నాయి. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఏరియా ఆస్పత్రిలో కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న మెజారిటీ ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేసింది. కొన్ని విభాగాల్లో రెండేసి పోస్టుల్లో ఒక్కొక్క ప్రత్యేక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు భర్తీ కావడంతో రిఫరల్‌ కేసులు తగ్గాయి. ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 350 నుంచి 400 మందికి వైద్యులు ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు.

చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం(30 పడకల ఆస్పత్రి)ని 2023లో గత ప్రభుత్వం ఏరియా ఆస్పత్రిగా స్థాయిని పెంచుతూ వంద పడకలు(ఏరియా ఆస్పత్రి) చేసింది. ఏరియా ఆస్పత్రికి 21 మంది వైద్యనిపుణుల పోస్టులను కేటాయించింది. అయితే స్థాయి పెంచినప్పటికి ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత వైద్యానికి పెద్దపీట వేసింది. నూతన నియామకాలు, పదోన్నతుల్లో గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వైద్యనిపుణుల పోస్టుల భర్తీకి తొలి ప్రాధాన్యం ఇచ్చింది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యనిపుణులు ఆసక్తి చూపడంతో కొంత కాలం మైదాన ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై వైద్యులను నియమించింది. అలాగే ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక రాయితీలు, అదనపు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులను ఏడాదిన్నర కాలంలో దశలవారీగా కూటమి ప్రభుత్వం సహకారంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అధికారులు భర్తీ చేశారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో 61 శాతం ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు భర్తీ కావడంతో కొంత వరకు వైద్యుల కొరత తీరింది.

అందుబాటులో ప్రత్యేక వైద్యనిపుణులు

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో 21 మంది వైద్య నిపుణులకుగాను 13 మంది ప్రత్యేక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గైనికాలజిస్టులు ఇద్దరు, ఎనస్థీషియన్‌ ఒకరు, పిడియాట్రిక్స్‌ ఇద్దరు, ఈఎన్‌టీ, జనరల్‌ ఫిజీషియన్‌, ఆర్థోపెడిక్‌, పేథాలజిస్టు, ఆప్తాలమిక్‌, దంత వైద్యనిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌(జనరల్‌ మెడిసిన్‌) అందుబాటులో వున్నారు. ప్రధాన విభాగాలకు చెందిన వైద్యనిపుణుల పోస్టులు భర్తీ కావడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి.

తగ్గిన రిఫరల్స్‌

గతంతో పోల్చుకుంటే ఏరియా ఆస్పత్రి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించే(రిఫరల్‌) రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో గర్భిణులు, చిన్నపిల్లలు, అర్థోపిడిక్‌, జనరల్‌ ఫిజీషియన్‌కు సంబంధించిన వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులను నర్సీపట్నం, కేజీహెచ్‌, పాడేరు జిల్లా ఆస్పత్రికి రోగులను తరలించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ముగ్గురు గైనికాలజిస్టులకు గాను అందుబాటులో నున్న ఇద్ధరు వైద్యులు గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలందిస్తున్నారు. ప్రతి రోజు 30 నుంచి 40 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మంత్రిత్వ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల తొమ్మిది, పది తేదీల్లో 250-300 మంది గర్భిణులకు అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌లు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి నెల 110-130 ప్రసవాలు జరుగుతున్నాయి. ఎనస్థీషియన్‌ అందుబాటులో ఉండడం వల్ల ప్రసవం కష్టమైన గర్భిణులకు ఏరియా ఆస్పత్రిలోనే సిజేరియన్లు చేస్తున్నారు. గతంలో ప్రసవం కష్టమైతే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, పాడేరు జిల్లా ఆస్పత్రికి పంపించాల్సివచ్చేది. కాగా ఏరియా ఆస్పత్రికి అనుబంధంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఇద్దరు పిడియాట్రిక్స్‌ వైద్యులు అందుబాటులో ఉండడంతో చిన్నపిల్లలు, శిశువులకు మెరుగైన వైద్యం అందుతుంది. క్లిష్టపరిస్థితుల్లో ఆస్పత్రికి తీసుకొచ్చిన చిన్నారులకు సైతం వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఆర్థోపిడిక్‌ అందుబాటులోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో చికిత్స అందుతుంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను కేజీహెచ్‌కి తరలిస్తున్నారు. సాధారణ ఆరోగ్య సమస్యలు, గొంతు, దంతాలు, కంటి సమస్యలతో వచ్చే రోగులకు జనరల్‌ ఫిజీషియన్‌, ఈఎన్‌టీ, డెంటిస్టు, ఆప్తాలమిక్‌ వైద్యులు పరీక్షలు నిర్వహించి సకాలంలో చికిత్స అందిస్తున్నారు.

వెంటాడుతున్న వసతి సమస్య

ఏరియా ఆస్పత్రిని కొన్నేళ్లుగా వసతి సమస్య వెంటాడుతున్నది. చింతపల్లిలో ప్రభుత్వం వందపడకల ఆస్పత్రి నూతన భవనం నిర్మాణాలకు రూ.25 కోట్ల నిధులు కేటాయించినప్పటికి పనులు సకాలంలో పూర్తి చేయడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో సుమారు 20ఏళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం నిర్మించిన భవనాన్ని ఆధునికీకరించుకుని వైద్యులు రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఒకే గదిలో నలుగురు వైద్యులు సర్దుకుని రోగులకు చికిత్స అందిస్తున్నారు. వార్డులు సైతం రోగులకు సరిపడడంలేదు. వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే రోగులు, వైద్యులు ఎదుర్కొంటున్న ప్రధాన వసతి సమస్య తీరనున్నది.

Updated Date - Jan 11 , 2026 | 11:20 PM