బొడ్డాపుట్టుకు కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:42 PM
మండలంలోని గోమంగి పంచాయతీ పరిధిలో శివారున ఉన్న బొడ్డాపుట్టు గ్రామాన్ని సోమవారం ఉదయం మండల స్థాయి అధికారులు సందర్శించారు.
కలెక్టర్ ఆదేశంతో గ్రామాన్ని సందర్శించిన అధికారులు
తాగునీరు, రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ
పెదబయలు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోమంగి పంచాయతీ పరిధిలో శివారున ఉన్న బొడ్డాపుట్టు గ్రామాన్ని సోమవారం ఉదయం మండల స్థాయి అధికారులు సందర్శించారు. ‘బొడ్డాపుట్టులో బోలెడు సమస్యలు’ శీర్షికన ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ టి.నిషాంతి ఆ గ్రామాన్ని సందర్శించాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక ఎంపీడీవో ఎస్.డి.శ్యామ్‌సుందర్, మండల స్థాయి అధికారులు సోమవారం తెల్లవారుజామున రెండు కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు ఎక్కి కాలినడకన ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు. వారితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో నీటి కోసం ఇబ్బంది పడకుండా పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరు ద్వారా వేరొక ట్యాంక్ ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. కొండపై రోడ్డు నిర్మించేందుకు కాస్త సమయం కావాలి కాబట్టి కలెక్టర్, పీవోలకు నివేదిక ఇస్తామని చెప్పారు. ఎంపీడీవో వెంట డిప్యూటి ఎంపీడీవో సత్యప్రసాద్, పంచాయతీరాజ్ జేఈ శివరామయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ వర్క్ ఇన్‌స్పెక్టర్ మత్స్యలింగం, తదితరులు ఉన్నారు.