Share News

మేయర్‌ పీఠం మాదే...లక్షకుపైగా మెజారిటీ

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:34 AM

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లు కూటమి పార్టీ అభ్యర్థులకు ఓటు వేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి అన్నారు.

మేయర్‌ పీఠం మాదే...లక్షకుపైగా మెజారిటీ

టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లు కూటమి పార్టీ అభ్యర్థులకు ఓటు వేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి అన్నారు. మేయర్‌ పీఠం కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం పోలింగ్‌ ముగిసిన అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ మేయర్‌ అభ్యర్థిని ముక్కా శ్రావణి లక్షకుపైగా మెజారిటీతో విజయం సాధించబోతున్నారన్నారు. అలాగే 120 వార్డుల్లో 80కుపైగా వార్డులను కూటమి కైవసం చేసుకోబోతున్నదన్నారు. పోలింగ్‌ శాతం 60 దాటుతుందని అంచనావేసినా 52కు అటు ఇటుగా నమోదైందన్నారు. మహిళలు ఎక్కువగా పోలింగ్‌ కేంద్రాలకు రావడం కూటమికి అనుకూలమని ఆయన అన్నారు.


మందకొడిగా పోలింగ్‌

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజోతి):

జీవీఎంసీలో పోలింగ్‌ ఆద్యంతం మందకొడిగానే సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి పెద్దగా కనిపించలేదు. కొన్నిచోట్ల అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓటర్లు ఎవరూ రాకపోవడంతో సిబ్బంది ఖాళీగా ఉండిపోవాల్సివచ్చింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా తొమ్మిది గంటల సమయానికి 3.34 శాతం, 11 గంటలకు 13.34 శాతం, ఒంటిగంటకు 26.5 శాతం, మధ్యాహ్నం మూడు గంటలకు 39.74, సాయంత్రం ఐదు గంటలకు 48.5 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి ఏడుగున్నర గంటల వరకు పోలింగ్‌ జరగడంతో చివరకు 51.47 శాతం నమోదైంది.


కాలు కదపని నగర ఓటరు!

ఇంటి నుంచి బయటకు రాని సగం మంది...

స్థానిక సంస్థల ఎన్నికలే కదా అని కొందరు నిర్లక్ష్యం

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలో దాదాపు సగం మంది ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. జీవీఎంసీ పరిధిలో 18,37,901 మంది ఓటర్లు ఉండగా, వారిలో సగం మంది మాత్రమే ఆదివారం తమ ఓటుహక్కును వినియోగించుకోవడం గమనార్హం.

2021లో జరిగిన జీవీఎంసీకి ఎన్నికల్లో 59 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు గత 15 రోజులుగా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ ఏమాత్రం మార్పు కనిపించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపరనే అభిప్రాయం ఉన్నప్పటికీ గత ఎన్నికల కంటే కూడా ఓటింగ్‌ శాతం తగ్గడం విస్మయానికి గురిచేసింది. తగ్గిన పోలింగ్‌ ఎవరికి మేలు చేస్తుంది?, ఎవరిని దెబ్బతీస్తుంది?...అనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు చాలామంది పోలింగ్‌ కేంద్రాలకు రాకపోవడంతో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు జాబితాలోని పేర్లు, చిరునామా ఆధారంగా ఇళ్లకు వెళ్లి ఓటువేయడానికి రావాలంటూ కోరారు. దాంతో కొందరు అప్పటికప్పుడు బయలుదేరి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందువల్లనే కొన్ని కేంద్రాల్లో రాత్రి 7.30 గంటలు వరకు పోలింగ్‌ జరిగినట్టు చెబుతున్నారు.


ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో వైఫల్యం

చాలాచోట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైంది. అందరికీ వార్డు సచివాలయాల సిబ్బంది స్లిప్పులు పంపిణీ చేయలేకపోయారు. కొంతమందికి ఇచ్చేసి తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. ముఖ్యంగా అపార్టుమెంట్లు, గ్రూప్‌ హౌస్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్నవారికి స్లిప్పులు సక్రమంగా అందలేదు. కొన్నిచోట్ల అభ్యర్థులు స్లిప్పులు పంపిణీ చేశారు. వాటి ఆధారంగా చాలామంది పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి నిర్వహణ కోసం అనేక దఫాలు సమీక్షలు, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన అధికారులు కీలకమైన ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణను విస్మరించారు. ఆ బాధ్యతను సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి అప్పగించారు. కానీ, జోనల్‌ కమిషనర్లు తమ పరిధిలో స్లిప్పుల పంపిణీపై దృష్టిసారించలేదు. ఈ నేపథ్యంలో కొందరు ఓటర్లు ఎన్నికలకు ముందురోజు సచివాలయాలకు వెళ్లి స్లిప్పులు తీసుకున్నారు. ఏదేమైనా స్లిప్పులు అందకపోవడంతో పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు. జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడానికి స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగకపోవడం ఒక కారణమని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు పలువురు వ్యాఖ్యానించారు.


క్రాస్‌ ఓటింగ్‌ ప్రచారం

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో కొంతవరకు క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల కార్పొరేటర్‌ అభ్యర్థి వరకు కూటమికి ఓటు వేసి, మేయర్‌ ఓటును ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి వేశారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అధికార పక్షం మాత్రం ప్రజలకు క్రాసింగ్‌ ఓటింగ్‌ చేయాల్సిన అవసరం ఏమీ లేదని అంటోంది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్థానిక అభ్యర్థులను గెలిపించడానికే కృషి చేశారని, క్రాస్‌ ఓటింగ్‌ జరగడానికి అవకాశం లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 02 , 2026 | 01:34 AM