Share News

మేయర్‌ పీఠమే లక్ష్యం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:48 AM

తెలుగుదేశం పార్టీకి విశాఖ నగరం కంచుకోటని, గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలతో ఎమ్మెల్యేలు విజయం సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.

మేయర్‌ పీఠమే లక్ష్యం

  • ఆ దిశగా కలిసి పనిచేయాలి

  • జనసేన, బీజేపీతో కలిసి సాగాలి

  • టీడీపీకి విశాఖ కంచుకోట

  • జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

  • సందడిగా టీడీపీ విశాఖ పార్లమెంటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీకి విశాఖ నగరం కంచుకోటని, గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలతో ఎమ్మెల్యేలు విజయం సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారంవిశాఖ పార్లమెంటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ జీవీఎంసీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి పార్టీలు మేయరు పీఠం కైవశం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇప్పటి నుంచే జనసేన, బీజేపీతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొంతమంది నాయకులకు నామినేటెడ్‌ పదవులు వచ్చాయని, మిగిలిన వారికి రెండోవిడతలో ఇస్తారన్నారు. పార్టీలో బూత్‌లెవెల్‌ నుంచి వార్డు వరకు బాధ్యులంతా జనసేన, బీజేపీనేతలు, కేడర్‌తో కలిసి పనిచేయాలన్నారు.రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలో అభివృద్ధి గాడిన పడిందని, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే 2029లోనూ కూటమి అధికారంలోకి రావాల్సి ఉంటుందన్నారు.

టీడీపీ నూతన కమిటీ అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ విశాఖలో టీడీపీ బలమైన కేడర్‌ ఉందని, మిగిలిన ప్రాంతాలకు స్ఫూర్తిగా పనిచేస్తున్నారన్నారు. కొత్త కార్యవర్గంతో నగరంలో పార్టీ మరింత పటిష్ఠం కావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్‌ పి.గణబాబు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రతి శుక్రవారం నగరంలో విధ్వంసం సృష్టించి భయాందోళనలకు గురిచేసేవారని, ఇప్పుడు నగరం ప్రశాంతంగా ఉందన్నారు. జగన్‌ పాదయాత్ర చేస్తే గుంతలు లేని రోడ్లు కనిపిస్తాయన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుభవం ఉన్న నాయకులన్నారు. సమర్థతను గుర్తించిన అధిష్ఠానం ఎంపికచేసిందని, పార్టీ ని మరింత బలోపేతం దిశగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను సమన్వయంచేసుకుని సాగాలన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ కొత్త కమిటీలో సీనియర్లకు అవకాశం ఇచ్చారని, బాగా పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నారు. విశాఖ పార్లమెంటు మాజీ అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ నూతన కమిటీ సారధ్యంలో పార్టీ అభివృద్థి చేస్తారని ఆకాక్షించారు. విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి మాట్లాడుతూ విశాఖపై సీఎం చందబాబు, యువనేత లోకేశ్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయరు పీఠం కైవశం చేసుకునేలా పనిచేస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ కార్యకర్తలకు మేలుచేసే పార్టీ తెలుగుదేశమన్నారు. అనంతరం పార్లమెంటు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ, మిగిలిన కార్యవర్గ సభ్యులతో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రమాణం చేయించి, సత్కరించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ఉత్తర, దక్షిణ ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, సీహెచ్‌.వంశీకృష్ణ శ్రీనివాస్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ఎంవీ.ప్రణవగోపాల్‌, దక్షిణ టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.నజీర్‌, నాయకులు కోరాడ రాజబాబు, వెల్లంకి భరత్‌, ఆరేటి మహేష్‌, పైల ముత్యాలనాయుడు, అక్కరమాని వెంకటరావు, పుచ్చా విజయకుమార్‌, ఒమ్మి సన్యాసిరావు, మూర్తియాదవ్‌, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. తొలుత సంపత్‌ వినాయగర్‌ ఆలయం నుంచి ఓపెన్‌ టాప్‌ వాహనంపై ఎమ్మెల్యే వెలగపూడి, పార్లమెంటు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే పట్టాభి, లొడగల కృష్ణ ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. కార్యాలయంలో ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Updated Date - Jan 26 , 2026 | 12:48 AM