Share News

ప్రజారోగ్యం, మెకానికల్‌ అధికారుల తీరుపై మేయర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:09 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది.

ప్రజారోగ్యం, మెకానికల్‌ అధికారుల తీరుపై మేయర్‌ ఆగ్రహం

ఎంవీవీ-ఎంకే పార్క్‌ అపార్టుమెంట్‌కు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ, నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణకు సిఫారసు

‘రాసా’ సంస్థపై ఎందుకంత ప్రేమ అంటూ నిలదీత

వాడీవేడీగా స్టాండింగ్‌ కమిటీ సమావేశం

గాజువాక జీటీఎస్‌లో యంత్రాల మరమ్మతు

ప్రతిపాదనపై కమిటీ అభ్యంతరం

293 అంశాలకు కమిటీ ఆమోదం

విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమైన కమిటీ సభ్యులు ప్రధాన అజెండాలోని 193 అంశాలతోపాటు టేబుల్‌ అజెండాగా తీసుకొచ్చిన 101 అంశాలపై చర్చించారు. టేబుల్‌ అజెండాలో ఒక అంశం మినహా మిగిలిన వాటన్నింటినీ ఆమోదించారు.

కూర్మన్నపాలెంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఎంవీవీ-ఎంకే పార్క్‌ అపార్టుమెంట్‌కు తాగునీటి సరఫరా నిమిత్తం పైప్‌లైన్‌ వేసే అంశాన్ని గతంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం అజెండాలో చేర్చగా, నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని, జీవీఎంసీకి చెల్లించాల్సిన ఫీజులు రూ.లక్షల్లో ఎగ్గొట్టినప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చారని సభ్యులు ఆరోపించడంతో అప్పట్లో వాయిదా వేశారు. అదే అంశాన్ని తాజాగా జరిగిన స్టాండింగ్‌ కమిటీ అజెండాలో చేర్చడంతో మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓపెన్‌ స్పేస్‌ చార్జీల కింద జీవీఎంసీకి పన్ను కట్టించకపోవడంలో ఆంతర్యమేమిటని అధికారులను ప్రశ్నించారు. ఆ భవన నిర్మాణంలో 50 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తెలిసినా, అధికారులు ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ హరిదాసుని ప్రశ్నించారు. దీనిపై చీఫ్‌ సిటీప్లానర్‌ వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు ఆమోదించేది లేదని మేయర్‌ స్పష్టంచేశారు. అనంతరం అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నవారు తాగునీటికోసం ఇబ్బందిపడుతున్నారని కమిటీ సభ్యులు వివరించడంతో పైప్‌లైన్‌ నిర్మాణానికి ఆమోదం తెలుపుతున్నామని మేయర్‌ ప్రకటించారు. అయితే ఆ భవన నిర్మాణానికి అనుమతులు, ప్రభుత్వ భూమి కబ్జా, జీవీఎంసీకి చెల్లించాల్సిన పన్ను బకాయిలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ వంటి అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. గాజువాక 76వ వార్డు పరిధిలో ఉన్న గార్బేజ్‌ టాన్స్‌ఫర్‌స్టేషన్‌ (జీటీఎస్‌)లో యంత్రాల మరమ్మతులకు రూ.49 లక్షలు వెచ్చించేందుకు మెకానికల్‌ విభాగం అధికారులు ప్రతిపాదించడంపై కమిటీ సభ్యుడు రాపర్తి త్రివేణివరప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. జీటీఎస్‌ నిర్వహణ బాధ్యతలను ‘రాసా’కు జీవీఎంసీ అప్పగించిందని, ఆ సంస్థే మరమ్మతులు చేయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఆ సంస్థ డీజిల్‌ను పక్కదారి పట్టించడంతో సుమారు రూ.50 లక్షలు రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారని, ఇంతవరకూ ఆ పని చేయకపోవడానికి కారణం తెలపాలని పట్టుబట్టారు. దీనికి మెకానికల్‌ విభాగం అధికారులు సమాధానం చెప్పకపోవడంతో మేయర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవీఎంసీ నిధులను దుర్వినియోగం చేసిన ఆ సంస్థ నుంచి నిధులు రాబట్టకపోగా, తిరిగి టెండర్లు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జీటీఎస్‌ రిపేరు ప్రతిపాదనను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జీవీఎంసీలో ఉద్యోగం చేస్తూ మృతిచెందిన ముగ్గురు ప్రజారోగ్య విభాగం ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు కల్పించే అంశాన్ని 2024లో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం వాయిదా వేస్తే...ఇంతవరకు దాచిపెట్టి ఇప్పుడు అజెండాలో చేర్చడంపై కమిటీ సభ్యులు, మేయర్‌ అధికారులను నిలదీశారు. అధికారులు సరిగా వివరణ ఇవ్వలేకపోవడంతో ఆయా అంశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొంతసేపటి తర్వాత మేయర్‌ను ఏడీసీ సత్యవేణి వచ్చి అధికారులు సీఐఐ సదస్సు, యోగాంధ్ర, విశాఖ ఉత్సవ్‌, ఐఎఫ్‌ఆర్‌ వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోవడంతో జాప్యం జరిగిందని వివరించడంతో ఆయా అంశాలను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. యోగాంధ్ర సమయంలో ఏర్పాటుచేసిన 200 టాయిలెట్లకు దాదాపు రూ.1.5 కోట్లు చెల్లించే ప్రతిపాదనను గతంలో వాయిదా వేయగా, ఇప్పుడు మళ్లీ అజెండాలో చేర్చారు. దీనిపై మేయర్‌తోపాటు కమిటీ సభ్యులు కూడా అభ్యంతరం తెలపగా, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఐ.నరేష్‌కుమార్‌ వివరణ ఇస్తూ ఒక్కో టాయిలెట్‌ను గుంటూరు, విజయవాడ నుంచి తీసుకువచ్చారని, ఒకరోజు వాడినప్పటికీ ఐదు రోజులు అద్దె ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అంతమొత్తం లెక్కించామన్నారు. దీనికి కమిటీ సభ్యులు సంతృప్తిచెందడంతో ఆమోదించారు. యోగాంధ్ర సమయంలో ప్రధాని నరేంద్రమోదీ నగరానికి వచ్చినప్పుడు ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలో హెలీప్యాడ్‌ వద్ద కఠినరాళ్ల తొలగింపునకు సుమారు రూ.14 లక్షల బిల్లు చెల్లింపు అంశాన్ని గతంలో వాయిదా వేసిన కమిటీ సభ్యులు ఇప్పుడు వాటికి ఆమోదం తెలిపారు. కార్పొరేటర్ల పదవీకాలం ఈనెల 17తో ముగుస్తున్నందున వారికి వీడ్కోలు తెలిపే కార్యక్రమం నిర్వహణకు కమిటీ ఆమోదం తెలిపింది. బీచ్‌రోడ్డులోని తృప్తి క్యాంటీన్‌ కోసం ఏర్పాటుచేసిన కంటెయినర్‌కు బేస్‌మెంట్‌ నిర్మాణానికి రూ.4.7 లక్షలు ఖర్చుచేసిన అంశంపై మొదట్లో కమిటీ సభ్యులు వాయిదావేయగా, తర్వాత ఆ అంశాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యం కలిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 01:09 AM