Share News

పెద్దాస్పత్రికి సుస్తీ!

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:55 AM

కేజీహెచ్‌లో పనిచేసే కొందరు వైద్యులు ప్రైవేటు సేవలో తరిస్తున్నారు. ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించాల్సిన వేళల్లో సొంత క్లినిక్‌లు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు.

పెద్దాస్పత్రికి సుస్తీ!

ప్రైవేటు సేవలో తరిస్తున్న కొంతమంది వైద్యులు

ఉదయం కొద్దిసేపు కాలక్షేపం చేసి జంప్‌

కేజీహెచ్‌కు వస్తున్న రోగుల మళ్లింపు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం

అనేక విభాగాల్లో జూనియర్‌ వైద్యులపైనే ఓపీ, ఐపీ సేవల భారం

నిరుపేదలకు అందే సేవలపై ప్రభావం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేజీహెచ్‌లో పనిచేసే కొందరు వైద్యులు ప్రైవేటు సేవలో తరిస్తున్నారు. ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించాల్సిన వేళల్లో సొంత క్లినిక్‌లు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రభుత్వ హెచ్చరికలతో ఆమధ్య కొన్నాళ్లు ఆగారు. ఒకరిద్దరు వెళ్లినా వెంటనే తిరిగి వచ్చేవారు. అయితే, కొద్దిరోజులు నుంచి మళ్లీ కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం ప్రారంభించారు. ఉదయం ఆస్పత్రికి వచ్చి, ఓపీలో కొంతసేపు కాలక్షేపం చేసి ప్రైవేటు క్లినిక్‌లు/ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. అత్యంత కీలక విభాగాలకు చెందిన సీనియర్‌ వైద్యులు కూడా సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఓపీ, వార్డుల్లో జూనియర్‌ వైద్యులే ఉంటున్నారు. ఇది రోగులకు అందే సేవలపై ప్రభావాన్ని చూపిస్తోంది.

కేజీహెచ్‌ నుంచి ప్రైవేటుకు...

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రోజుకు రెండు, మూడు వేల మంది కేజీహెచ్‌కు వస్తుంటారు. అవసరమైన వారికి ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకంలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయవచ్చు. దీనివల్ల ఆస్పత్రికి ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి భారీగా నిధులు వస్తుంటాయి. అయితే, ఎన్‌టీఆర్‌ వైద్య సేవ నుంచి భారీగా డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉన్న రోగులను కొందరు వైద్యులు తాము పనిచేసే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకుపోతున్నారు. ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కింద అందే మొత్తానికి అదనంగా కొంత చెల్లిస్తే మెరుగైన వైద్యం అందిస్తామని రోగులకు చెబుతున్నారు. ఈ విషయాన్ని కొందరు తమకు అత్యంత సన్నిహితంగా ఉండే జూనియర్‌ వైద్యుల ద్వారా రోగులకు చెప్పిస్తుంటారు. ఇలా ప్రతిరోజూ ఎంతోమంది రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నట్టు చెబుతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ

ఆస్పత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ఉన్నతాధికారులు వార్డుల్లో రౌండ్స్‌ వేయడం పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల రోగులు తమ ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొందరు వైద్యులు తమకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం జిల్లా కలెక్టరైనా దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన కొందరు వార్డుల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం ద్వారా బయట ప్రాక్టీస్‌కు వెళుతున్న వైద్యులను కట్టడిచేయగలిగారు. ప్రస్తుత కలెక్టర్‌ కూడా వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తే రోగులకు మెరుగైన సేవలు అందేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే, సూపరింటెండెంట్‌, సీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవోల మధ్య విభేదాలు పాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్టు చెబుతున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:55 AM