Share News

ప్రాణం తీసిన కరంటు తీగ

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:09 AM

కరంటు తీగ రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పశువుల షెడ్డు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్తంభాలు సమీపంలోని విద్యుత్‌ తీగలకు తగలడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాణం తీసిన కరంటు తీగ

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

పశువుల షెడ్డు నిర్మాణంలో అపశ్రుతి

ఇసకలపాలెంలో విషాదం

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

పద్మనాభం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):

కరంటు తీగ రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పశువుల షెడ్డు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్తంభాలు సమీపంలోని విద్యుత్‌ తీగలకు తగలడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇసకలపాలెం గ్రామానికి చెందిన కాళ్ల సూరీడు, కుమారుడు కాళ్ల సూరిబాబుతో కలిసి పశువుల షెడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం కృష్ణాపురం కాలనీకి చెందిన కంటుబోతు శ్రీనును సహాయం తీసుకున్నారు. వీరు ముగ్గురు షెడ్డు నిర్మాణానికి స్తంభాలు వేస్తున్నారు. స్తంభం ఎత్తుతుండగా సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలను ఇనుప చువ్వలు తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో కాళ్ల సూరీడు (65), కంటుబోతు శ్రీను(41) అక్కడికక్కడే మృతి చెందారు. సూరిబాబు (44) తీవ్ర గాయాల పాలవడంతో 108 వాహనంలో విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఈ విషాధ ఘటనతో రెండు కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొద్దిసేపటి వరకు తమతో మాట్లాడిన వారు ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ బి.గణేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీశారు. పద్మనాభం సీఐ సీహెచ్‌ శ్రీధర్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంటుభుక్త శ్రీనుకు భార్యతో పాటు కుమార్తె మాధురి, సాయిపవన్‌, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబమంతి అతడి సంపాదనపైనే ఆధారపడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తూ అందరితో కలివిడిగా ఉండి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా శ్రీను స్వగ్రామం విజయనగరం జిల్లా డెంకాడ మండలం గుండాలపేట కాగా, జీవనాధారం కోసం వచ్చి ఇసకలపాలెంలో స్థిరపడ్డారు.

Updated Date - Mar 02 , 2026 | 01:09 AM