వృక్ష విలాపం
ABN , Publish Date - May 12 , 2026 | 01:40 AM
గ్రామాలకు నాణ్యమైన, నిరంతం విద్యుత్ సరఫరాకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కొత్త విద్యుత్తు లైన్ల కోసం చెట్లను నరికివేస్తున్న ఈపీడీసీఎల్
కోటవురట్ల- అడ్డురోడ్డు మధ్య పదుల సంఖ్యలో వృక్షాలపై వేటు
నర్సీపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):
గ్రామాలకు నాణ్యమైన, నిరంతం విద్యుత్ సరఫరాకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా వున్నాయంటూ చెట్లతోపాటు భారీ వృక్షాలను సైతం నిర్దాక్షణ్యంగా నరికివేస్తున్నారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ఏళ్ల తరబడి వయసున్న వృక్షాలను నరికివేయడం తగదని అంటున్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా గృహాలకు, వ్యవసాయ రంగానికి వేర్వేరుగా విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక లైన్లు వేస్తున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం- అడ్డరోడ్డు మార్గంలో కొత్తగా విద్యుత్ స్తంభాలు అమర్చుతున్నారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం ఫీడర్ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు పాతడానికి మెయిన్ రోడ్డుకు పక్కన భారీ వృక్షాలతోపాటు, ఏపుగా పెరుగుతున్న చెట్లను విద్యుత్ రంపాలతో అడ్డంగా కోసేస్తున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం చెట్లు నరకాల్సి వస్తే.. ముందుగా వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలి. ఒక చెట్టు తొలగిస్తే.. దానికిబదులు పది మొక్కలు నాటాలి. కానీ విద్యుత్‌లైన్ల ఏర్పాటు కోసం వృక్షాలను నరికివేస్తున్న చోట ఈ నిబంధన అమలు కావడంలేదు. చెట్లను పెంచండి. వాటిని కాపాడండి. అవి మనల్ని కాపాడతాయంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక పక్క ప్రచారం చేస్తూ.. మరోపక్క వృక్షాలను నిలువునా నరికివేస్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీలైనంత వరకు చెట్లను నరకకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని, తప్పనిసరైతే కొమ్మల వరకే నరికివేయాలని సూచిస్తున్నారు.