దివికేగిన మారాజు
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:40 AM
భీమిలి నియోజకవర్గ రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు శాసించిన మాజీ మంత్రి రాజా సాగి దేవీ ప్రసన్న అప్పలనరసింహరాజు (ఆర్‌ఎస్‌డీపీఏఎన్‌రాజు) బుధవారం ఉదయం పద్మనాభం మండలం పాండ్రంగిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నాలుగుసార్లు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమైన అప్పలనరసింహరాజు...విపక్ష పార్టీల నాయకుల అభిమానాన్ని కూడా చూరగొని అజాత శత్రువుగా నిలిచారు.
మాజీ మంత్రి ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు కన్నుమూత
వరుసగా నాలుగుసార్లు భీమిలి నుంచి శాసనసభకు ఎన్నిక
నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం
పద్మనాభం/భీమునిపట్నం రూరల్,
ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
భీమిలి నియోజకవర్గ రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు శాసించిన మాజీ మంత్రి రాజా సాగి దేవీ ప్రసన్న అప్పలనరసింహరాజు (ఆర్‌ఎస్‌డీపీఏఎన్‌రాజు) బుధవారం ఉదయం పద్మనాభం మండలం పాండ్రంగిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నాలుగుసార్లు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమైన అప్పలనరసింహరాజు...విపక్ష పార్టీల నాయకుల అభిమానాన్ని కూడా చూరగొని అజాత శత్రువుగా నిలిచారు.
జననం
1946 జనవరి 23న ఆర్‌ఎస్ పద్మనాభరాజు, అచ్యుతియమ్మ దంపతులకు జన్మించిన అప్పలనరసింహరాజు బీఏ వరకు చదువుకున్నారు. ఆయన తండ్రి పద్మనాభరాజు భీమిలి సమితి అధ్యక్షునిగా, సోదరుడు సూర్యనారాయణరాజు 1977 నుంచి 1982 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.
వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయం 1983లో విజయనగరానికి చెందిన పూసపాటి ఆనందగజపతిరాజు భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచి విద్యా శాఖా మంత్రి అయ్యారు. 1984లో నాదెండ్ల సంక్షోభం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు ఆసమయంలో ఆనందగజపతిరాజుకు బొబ్బిలి ఎంపీగా అవకాశం కల్పించారు. దీంతో భీమిలి నుంచి పోటీ చేయడానికి చాలామంది ప్రయత్నాలు సాగించారు. అప్పటికి అప్పలనర్సింహరాజు రాజకీయ అనుభవం లేదు. పాండ్రంకి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే అదృష్టం పరీక్షించుకుందామని రాజు కూడా భీమిలి సీటు కోసం యత్నించారు. టికెట్ ఆశిస్తూ ఏకంగా 11 మంది హైదరాబాద్ వెళ్లి నందమూరి తారకరామారావును కలిశారు. అందరూ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, పరిశీలించి తెలియజేస్తానని వారికి ఎన్టీఆర్ సూచించారు. దీంతో అప్పలనరసింహరాజు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. సామర్లకోటలో రైలు ఆగిన సమయంలో అప్పలనర్సింహరాజు అర్జంటుగా హైదరాబాద్ రావాలని అనౌన్స్‌మెంట్ వినిపించింది. వెంటనే రాజు సామర్లకోటలో దిగి, మరో రైలులో హైదరాబాద్ వెళ్లి ఎన్టీఆర్‌ను కలిశారు. ‘భీమిలి టికెట్ మీకే ఇస్తున్నాం...’ అని ఎన్టీఆర్ చెప్పడంతో రాజు ఆనందంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారం కోసం ఎన్టీఆర్‌తో ఫొటో తీయించుకుని, రంగంలోకి దిగారు. 1985, ఆ తర్వాత వరుసగా 1989, 1994, 1999 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కర్రి సీతారామ్ చేతిలో అతిస్వల్ప ఓట్లతో ఓటమి చెందారు.
అనూహ్యంగా మంత్రి పదవి
బడ్జెట్ ప్రతి లీకైందనే కారణంతో 1988లో ఎన్టీఆర్ తన మంత్రివర్గంలోని 33 మంది మంత్రులను ఒకేసారి తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతిభాభారతి స్థానంలో గుండ అప్పలసూర్యనారాయణకు సాంఘిక సంక్షేమ శాఖ, విజయనగరం జిల్లాలో అశోక్‌గజపతిరాజు స్థానంలో ఉత్తరాపల్లి ఎమ్మెల్యే కోళ్ల అప్పలనాయుడుకు దేవదాయశాఖ, విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు స్థానంలో భీమిలి ఎమ్మెల్యే అప్పలనర్సింహరాజకు ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని, తక్షణం బయలుదేరి హైదరాబాద్ రావాలని రాజుకు ఉదయం ఆరు గంటలకు ఎన్టీ రామారావు స్వయంగా ఫోన్ చేశారు. ఆయన మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు.
అభివృద్ధి ప్రదాత
భీమిలి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడంలో అప్పలనరసింహరాజు కీలకపాత్ర పోషించారు. భీమిలి, తొట్లకొండ, బావికొండ, పద్మనాభం విజయరామరాజు సమాధి, పాండ్రంగి అల్లూరి సీతారామరాజు జన్మస్థలం తదితర వాటికి పర్యాటకంగా ప్రాచుర్యం కల్పించారు. మండల కేంద్రాలను, గ్రామాలను నియోజకవర్గ కేంద్రానికి అనుసంధానిస్తూ అనేక రహదారులు నిర్మించారు. భీమిలి డైట్, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు సమకూర్చారు.