Share News

ఖాకీ దందా

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:57 AM

అతనో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ప్రస్తుతం ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

ఖాకీ దందా

డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ట్రాఫిక్‌ ఎస్‌ఐ చేతివాటం

పట్టుబడినవారిలో సగం మంది నుంచి ఐదేసి వేల రూపాయల చొప్పున వసూలు

మిగిలిన వారిపైనే కేసులు నమోదు

తన స్టేషన్‌ పరిధిలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, షోరూమ్‌ల నుంచి నెలవారీ మామూళ్లు

అధికారాన్ని అడ్డంపెట్టుకుని హోటల్‌లో గదులు బుకింగ్‌

పట్టించుకోని ఉన్నతాధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అతనో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ప్రస్తుతం ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే కిందిస్థాయి సిబ్బందే ఆరోపిస్తున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో కొందరి నుంచి డబ్బులు తీసుకుని విడిచిపెట్టేస్తున్నారని, వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో కొందరు అధికారుల వ్యవహారశైలి వల్ల పోలీస్‌ శాఖ ప్రతిష్ఠ దెబ్బంటుంది. నిజాయితీగా, నిబద్ధతతో ప్రజలకు సేవలందించాల్సింది పోయి...వ్యక్తిగత స్వార్థంతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈస్ట్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఒక అధికారి వ్యవహారశైలి పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గతంలో మల్కాపురం, ఎయిర్‌పోర్టు స్టేషన్లలో పనిచేసిన సదరు ఎస్‌ఐ ప్రస్తుతం ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ట్రాఫిక్‌ ఎస్‌ఐలు ప్రతిరోజూ సాయంత్రం, రాత్రి సమయాల్లో మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని పట్టుకునేందుకు డ్రంకన్‌ డ్రైవ్‌ పేరుతో తనిఖీలు చేస్తుంటారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు తేలితే వారి వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించాలి. పట్టుబడినవారి డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలను తీసుకుని మరుసటిరోజు స్టేషన్‌కు వచ్చి వాహనాన్ని తీసుకువెళ్లాల్సిందిగా సూచించాలి. తర్వాత కేసును కోర్టులో ఫైల్‌ చేస్తే విచారణ జరిపి కనీసం రూ.పది వేలు జరిమానా లేదా జైలుశిక్ష విఽధిస్తుంది. అయితే డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడినవారు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందనే భయంతో కేసు లేకుండా చూడాలని పోలీసులను ప్రాధేయపడుతుంటారు. ఇలాంటి వారి బలహీనతను ఆసరాగా తీసుకుని సదరు ఎస్‌ఐ పది కేసులు పట్టుకుంటే అందులో ఐదు కేసుల్లో డబ్బులు తీసుకుని వదిలేసి, మిగిలిన ఐదింటిని మాత్రమే అధికారికంగా చూపిస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. వదిలేసిన వారి నుంచి కనీసం రూ.ఐదు వేలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అలాగే స్టేషన్‌ పరిధిలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, షోరూమ్‌లు, నిర్మాణంలో ఉండే పెద్ద భవనాల యజమానులు, నిర్మాణ సామగ్రి రవాణా చేసే లారీలు, రెడీమిక్స్‌ లారీల నుంచి నెలవారీ మామూళ్లను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఒక హోంగార్డు ద్వారా నెలవారీ మామూళ్లను వసూలు చేయించేవారని, కొద్దిరోజుల కిందట సదరు హోంగార్డుపై ఒక యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అక్కడి నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతానికి సదరు సబ్‌ ఇన్‌స్పెక్టరే స్వయంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా తాను పనిచేసే స్టేషన్‌ పరిధిలోని ఒక కానిస్టేబుల్‌ను అటాచ్‌మెంట్‌ డ్యూటీ పేరుతో తాను తనిఖీ చేసిన చోటకు తీసుకువెళుతున్నారని ఆరోపిస్తున్నారు. తాను ట్రాఫిక్‌ ఎస్‌ఐనని చెప్పి స్టేషన్‌ పరిధిలోని హోటళ్లు, లాడ్జిలకు వెళ్లి గది ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అతడి గురించి ఉన్నతాధికారులతోపాటు స్పెషల్‌ బ్రాంచి అధికారులకు కూడా సమాచారం ఉందని, అయినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:57 AM