Share News

కడియం మొక్కలు మాయం

ABN , Publish Date - May 09 , 2026 | 10:34 PM

అరకులోయ పట్టణ సుందరీకరణలో భాగంగా సెంటర్‌ డివైడర్‌పై నాటిన మొక్కలు మాయమయ్యాయి. దీంతో లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. మొక్కల సంరక్షణను పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కడియం మొక్కలు మాయం
అరకులోయలో సెంటర్‌ డివైడర్‌పై కనిపించని కడియం పూల మొక్కలు

అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలు వృథా

సెంటర్‌ డివైడర్‌పై నాటిన మొక్కలు ఏమయ్యాయి..

ప్రశ్నిస్తున్న అరకులోయ పట్టణవాసులు

అరకులోయ, మే 9 (ఆంధ్రజ్యోతి): అరకులోయ పట్టణాన్ని అందంగా తయారు చేసేందుకు సెంటర్‌ డివైడర్‌పై నాటిన కడియం మొక్కలు కనిపించకుండా పోయాయి. అలాగే అరకు ఉత్సవ్‌ జరిగినప్పుడు, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 7 వేల పూల మొక్కలను కడియం నుంచి రప్పించి నాటారు. ప్రస్తుతం సెంటర్‌ డివైడర్‌ పైన అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి తప్ప దాదాపు మొక్కలైతే లేకుండా పోయాయి. ఈ మొక్కలు కడియం నుంచి తీసుకురావడానికి, తీసుకువచ్చిన మొక్కలను నాటినందుకు పెదలబడు గ్రామపంచాయతీ రూ.4.5 లక్షలు ఖర్చు చేసింది. ఇన్ని లక్షలు వ్యయం చేసినా పంచాయతీ అధికారులు మొక్కల సంరక్షణలో పూర్తిగా విఫలం చెందారు. నాటిన మొక్కలను ఎవరైనా తీసుకు వెళ్లిపోయారా? సంరక్షణ లేక చనిపోయాయో తెలియని దుస్థితి నెలకొంది. మొక్కలు వేసిన కొద్ది రోజులుపాటు పంచాయతీ పాలకవర్గం ట్యాంకర్‌తో నీటి తడులు పెట్టించింది. ప్రత్యేకాధికారుల పాలన వచ్చిన తర్వాత మొక్కల సంరక్షణను పట్టించుకోలేదని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల అరకులోయలో మూడు రోజులపాటు వెంకన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా సెంటర్‌ డివైడర్‌పై దుకాణాలు ఏర్పాటు చేయడంతో మొక్కలకు కొంత మేర నష్టం వాటిల్లింది. సెంటర్‌ డివైడర్‌పై దుకాణాలు పెట్టవద్దని పంచాయతీ అధికారులెవరూ దుకాణదారులను వారించలేదు. లక్షల రూపాయలు వ్యయం చేసి కడియం నుంచి తీసుకువచ్చి నాటిన మొక్కలు కనబడకుండా పోవడంతో ప్రత్యేకాధికారుల పాలనపై పట్టణవాసులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. వెంకన్న కల్యాణ ఉత్సవాల సమయంలో పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగినా ప్రత్యేకాధికారి పట్టించుకోలేదని పట్టణవాసులు విమర్శిస్తున్నారు. అరకులోయకు రెగ్యులర్‌ ఎంపీడీవో, పంచాయతీకి ఈవోలను నియమించాలని మండలంలోని తాజామాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. సెంటర్‌ డివైడర్‌పై లక్షలాది రూపాయలు వెచ్చించి నాటిన పూలమొక్కలు మాయంపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Updated Date - May 09 , 2026 | 10:34 PM