Share News

చరిత్ర పుటల్లోకి ఉమ్మడి జడ్పీ

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:20 AM

నగరం, మైదానం, ఏజెన్సీ ప్రాంతాలతో కూడిన ‘ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌’ ఇక చరిత్రగా మిగలనున్నది. ప్రస్తుత జడ్పీ పాలకవర్గం గడువు గురువారంతో తీరిపోనున్నది. ఈనెల 25వ తేదీన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా పరిషత్‌ పాలన ప్రారంభం కానున్నది. ఉమ్మడి ఏపీలో అతిపెద్ద జిల్లా పరిషత్‌లలో ఒకటిగా గుర్తింపుపొందిన విశాఖ జడ్పీ 1959 నవంబరు ఒకటో తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తొమ్మిది మంది చైర్మన్లు (ఎనిమిది మంది జడ్పీ చైర్మన్లు, ఒకరు జిల్లా బోర్డు చైర్మన్‌)గా పనిచేశారు.

చరిత్ర పుటల్లోకి ఉమ్మడి జడ్పీ

నేటితో ముగియనున్న ఉమ్మడి జిల్లా పరిషత్‌ పాలన

1959లో విశాఖ జిల్లా పరిషత్‌ ఏర్పాటు

ఇప్పటివరకూ చైర్మన్లుగా తొమ్మిది మంది...

రేపటి నుంచి కొత్త జడ్పీ కార్యాలయాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

నగరం, మైదానం, ఏజెన్సీ ప్రాంతాలతో కూడిన ‘ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌’ ఇక చరిత్రగా మిగలనున్నది. ప్రస్తుత జడ్పీ పాలకవర్గం గడువు గురువారంతో తీరిపోనున్నది. ఈనెల 25వ తేదీన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా పరిషత్‌ పాలన ప్రారంభం కానున్నది. ఉమ్మడి ఏపీలో అతిపెద్ద జిల్లా పరిషత్‌లలో ఒకటిగా గుర్తింపుపొందిన విశాఖ జడ్పీ 1959 నవంబరు ఒకటో తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తొమ్మిది మంది చైర్మన్లు (ఎనిమిది మంది జడ్పీ చైర్మన్లు, ఒకరు జిల్లా బోర్డు చైర్మన్‌)గా పనిచేశారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మరింత పారదర్శకంగా, సమర్థంగా గ్రామ పాలన నిర్వహణకు బల్వంతరాయ్‌ మెహతా కమిటీ సూచన మేరకు పరిపాలనలో మూడు అంచెల వ్యవస్థ ఏర్పాటుజరిగింది. 1959 నవంబరు ఒకటో తేదీన జిల్లా పరిషత్‌లు ఏర్పాటైనా...అప్పటికే జిల్లా బోర్డు వ్యవస్థ ద్వారా ఎంపికైన సభ్యులు ఉండడంతో వారి పాలన 1963 వరకూ సాగింది. బ్రిటీష్‌ కాలం (1920)లో అమలులోకి వచ్చిన జిల్లా బోర్డుల చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా కొనసాగిన జిల్లా బోర్టు చైర్మన్‌గా 1958 నుంచి 1963 వరకు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పనిచేశారు. ఆ తరువాత జిల్లా పరిషత్‌ వ్యవస్థ అమలులోకి వచ్చింది. తొలిసారి జడ్పీ చైర్మన్‌గా 1963లో రాజాసాగి సూర్యనారాయణరాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1964 నుంచి 1976 వరకు రాజాసాగి సీతారామరాజు చైర్మన్‌గా పనిచేశారు. అక్కడ నుంచి జల్లిపల్లి సుభద్ర వరకు తొమ్మిది మంది చైర్మన్లుగా వ్యవహరించారు. మధ్యలో రిజర్వేషన్ల వివాదం తలెత్తడంతో 1995లో చైర్మన్‌గా ఎవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుత జడ్పీ గడువు ముగియనుండడంతో 25వ తేదీ నుంచి విశాఖ జిల్లా పరిషత్‌ పాలన కొనసాగుతుంది. అలాగే కొత్తగా 24 మండలాలతో అనకాపల్లి, 11 మండలాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌లు ఏర్పాటుకానున్నాయి.

Updated Date - Sep 24 , 2026 | 01:20 AM