పంచాయతీల్లో కాసుల గలగల
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:35 AM
పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడంలేదు.
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు
ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు
నమ్మకమైన కుటుంబాలకు బహుమతులు
గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడంలేదు. నామినేషన్ల పర్వం ముగియక ముందే సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. 27వ తేదీ మధ్యాహ్నం మూడుగంటల తరువాత తుది అభ్యర్థులు జాబితా వెల్లడిస్తారు.
జిల్లాలోని ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పద్మనాభం మండలాల్లో 79 గ్రామ పంచాయతీలకు వచ్చేనెల రెండోతేదీన ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌కు పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఇప్పటికే ఓటర్ల కొనుగోలుకు బేరాలు పెట్టేశారు. మొత్తం ఓటర్లలో తమకు నమ్మకమైన కుటుంబాలను గుర్తించి, పంపకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. నామినేషన్ దాఖలుచేసే రోజున మద్యం, బిర్యానీ పంపకాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నామినేషన్ దాఖలుచేసే సమయంలో రూ.5 లక్షల వరకు ఖర్చు చేశామని సర్పంచ్ అభ్యర్థి ఒకరు పేర్కొన్నారు. ఓటింగ్ జరిగేవరకు రోజూ మద్యానికి రూ.2 లక్షలు కేటాయించామన్నారు. యువత బీరు, మధ్య వయసువారు మద్యం కోరుతున్నారని మరో సర్పంచ్ అభ్యర్థి పేర్కొన్నారు. అవసరమైన మేరకు దుకాణాల యజమానులు మద్యం డోర్‌డెలివరీ చేస్తున్నారు. ఇందులో సింభభాగం చీప్ లిక్కరే. మహిళలకు చీరలు, గాజులు, గృహోపకరణాల పంపిణీకి నిర్ణయించామని, నగరం నుంచి హోల్‌సేల్‌గా వీటిని కొనుగోలుచేస్తామన్నారు. కాగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పంచాయతీల్లో ఓటు రేటు ఎక్కువ పలుకుతోందని చెబుతున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ ఉందంటున్నారు. నమ్మకమైన కుటుంబాల్లో 50, అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్న చోట ఓటుకు రూ.10వేల వరకు ఇవ్వనున్నారు. ఆయా కుటుంబాలకు చెందిన చోటా నాయకుడికి నగరంలో పార్టీలు ఏర్పాటుచేసి, ఎన్నికల తరువాత తిరుపతి తీసుకువెళ్తామనే హామీలు ఇస్తున్నారు.
గత ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు రూ. కోటి నుంచి రూ. మూడు కోట్ల వరకు చేరింది. ఆనందపురం మండలంలోని ఓ పంచాయతీలో సర్పంచ్ విజేతపై రెండు వర్గాలు రూ.మూడుకోట్లు బెట్టింగ్‌లు కట్టారన్న విషయం తాజాగా గుర్తుచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కనీసం రూ.25 లక్షల వరకు ఖర్చుచేయగా, ఒక అభ్యర్థి ఏకంగా రూ.90 లక్షలు వెచ్చించారు. దీనినిబట్టి సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రెండింతలు పెరుగుతుందని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు.
సర్పంచ్‌గా గెలిస్తే ఎంత సంపాదిస్తామన్నది ముఖ్యంకాదని.. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆనందపురం మండలంలో ఓ కూటమి నేత వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు కంటే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుందని అంచనావేశారు. ఆనందపురం మండలంలో ఇప్పటికే రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులు వేలం ద్వారా ఖరారుచేసుకుని, నామినేషన్లు దాఖలుచేశారు. మరో రెండు పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కానున్నాయి. కాగా నగరంలో రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే రైతులను కలుసుకునేందుకు గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, వారి అనుచరులు వస్తున్నారు. హడావిడి చేయకుండా ఒకరు లేదా ఇద్దరు వచ్చి రైతులతో మాట్లాడి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఇంకా నగరంలో ఉన్న తమ పంచాయతీల ఓటర్లను కలుసుకుని ప్రసన్నం చేసుకుంటున్నారు.
భారీగా నామినేషన్లు
సర్పంచ్‌లకు 207, వార్డు సభ్యులకు 1,076
నేటితో ముగియనున్న గడువు
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవులకు 207, వార్డు పదవులకు 1,076 నామినేషన్లు పడ్డాయి. దీంతో రెండు రోజుల్లో సర్పంచ్ పదవులకు 279, వార్డు సభ్యులకు 1,343 మంది నామినేషన్లు దాఖలుచేశారు. సర్పంచ్ పదవులకు ఆనందపురం మండలంలో 71, భీమిలి మండలంలో 35, పద్మనాభం మండలంలో 54, పెందుర్తి మండలంలో 47 మంది, వార్డు పదవులకు సంబంధించి ఆనందపురంలో 384, భీమిలిలో 195, పద్మనాభంలో 304, పెందుర్తిలో 193 మంది నామినేషన్లు దాఖలుచేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎంవీఎన్ శ్రీనివాసరావు తెలిపారు. రెండురోజుల్లో సర్పంచ్ పదవులకు ఆనందపురంలో 100, భీమిలిలో 46, పద్మనాభంలో 74, పెందుర్తిలో 59, వార్డు సభ్యులకు ఆనందపురంలో 400, భీమిలిలో 257, పద్మనాభంలో 382, పెందుర్తిలో 238 మంది నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. తొలి రోజు నామినేషన్లు దాఖలుచేయని పంచాయతీల్లో ఆదివారం అభ్యర్థులు తమమద్దతుదారులతో భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు సమర్పించారు. కాగా నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు.