సా..గుతున్న విచారణ.!
ABN , Publish Date - Jun 29 , 2026 | 01:04 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి నెలలు గడుస్తోంది.
ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ చర్యలు
ప్రభుత్వ ఆదేశాలతో ఏడు నెలల కిందట ప్రారంభం
ఇప్పటికీ కొనసాగుతుండడంపై విమర్శలు
కొందరిని వేధిస్తున్నారనే ఆరోపణలు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి నెలలు గడుస్తోంది. ఏడు నెలల కొందట విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికీ కొనసాగిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ వివిధ విభాగాల అధికారులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ప్రక్రియ వర్సిటీ ఉద్యోగులను తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురిచేస్తోంది. విచారణే ఇన్ని నెలలు జరిగితే.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేది ఎప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీ ఉన్నతాధికారుల కారణంగా తీవ్ర ఇబ్బందులుపడిన ఉద్యోగులు విజిలెన్స్ అధికారుల విచారణపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. కాగా విచారణ పేరుతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అడ్డగోలు నిర్ణయాలపై ప్రశ్నించాల్సిన అధికారులు.. పరిధికి మించి వ్యవహరిస్తుండడం పట్ల ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజిలెన్స్ అధికారుల తీరు ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు.
స్పష్టత లేకపోవడమే సమస్యా?
విచారణ చేపట్టాల్సిన అంశాలపై విజిలెన్స్ అధికారులకు స్పష్టత లేకపోవడంతోనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులను గంటల తరబడి ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. ఒకసారి వెళ్లిన విభాగాలు, ఉద్యోగుల వద్దకు పదేపదే వస్తున్నారని, ఒకేసారి సమాచారాన్ని సేకరించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెబుతున్నారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు కిందిస్థాయి ఉద్యోగులకే విజిలెన్స్ అధికారులు పరిమితమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలను తీసుకున్న, భాగస్వాములైన అధికారుల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు. అప్పటి ఉన్నతాధికారులను విచారిస్తే కీలక ఆధారాలు లభిస్తాయని, ఆ దిశగా విచారణను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూలోని పలు వురు ఉద్యోగులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది. అప్పటి వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి అండతో వారంతా రెచ్చిపోయారు. బహిరంగంగా వైసీపీకి మద్దతు పలకడంతో పాటు ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీపై కొందరు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నాటి వ్యవహారాలను పలువురు ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లగా, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏయూ రిజిస్ర్టార్‌కు ఆదేశాలొచ్చాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వాలు మారినా ఏయూలో పలువురు అధికారులు ఇప్పటికీ ఉన్నతస్థానాల్లోనే కొనసాగుతున్నారు. వీరిలో పదిమంది సీనియర్ ప్రొఫెసర్లు అడ్మినిస్ర్టేటివ్ పోస్టుల్లో ఉన్నారు. మరో నలుగురు నాన్‌టీచింగ్ స్టాఫ్. కాగా ఉన్నత విద్యా మండలి ఆదేశాలను వర్సిటీ అధికారులు బుట్టదాఖలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబును వివరణ కోరగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని జవాబిచ్చారు.