Share News

నెయ్యిపై కొండెక్కిన విచారణ!

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:26 AM

సింహాచలం దేవస్థానంలో తక్కువ ఖరీదు నెయ్యి వాడకంపై విచారణ కొండెక్కింది.

నెయ్యిపై కొండెక్కిన విచారణ!

ఏడాదిన్నర కిందట తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు సింహాచలంలోనూ తనిఖీలు

పరీక్షకు నమూనాలు

27 డబ్బాల నెయ్యి వెనక్కి...

లోపం లేదని తేలిందంటున్న అధికారులు

అలాంటప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ‘రైతు డెయిరీ’ కాంట్రాక్టు ఎందుకు రద్దు చేశారనే ప్రశ్నలు

మొన్నటిదాకా విశాఖ డెయిరీ, ఇప్పుడు ‘సంగం’ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానంలో తక్కువ ఖరీదు నెయ్యి వాడకంపై విచారణ కొండెక్కింది. ఎవరిపైనా చర్యలు చేపట్టలేదు. ఆ కాంట్రాక్టర్‌ నుంచి నెయ్యి తీసుకోవడం ఆపేశారు. విశాఖ డెయిరీ నుంచి కొన్నాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు వారిని పక్కనపెట్టి సంగం డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చారు.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల తయారీ, దీపారాధనలకు నాణ్యమైన నెయ్యి వాడడం లేదని తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంతో ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది. ఎవరు తక్కువకు కోట్‌ చేస్తే వారికే కాంట్రాక్టు ఇవ్వాలని దేవదాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ప్రధాన ఆలయాల్లో టెండర్లు పిలిచి ఎల్‌-1 వచ్చిన వారికి నెయ్యి సరఫరా బాధ్యత అప్పగిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన నెయ్యి కిలో రూ.600తో ప్రారంభమై రూ.2 వేల వరకూ ఉంది. కానీ కాంట్రాక్టర్లు కిలో రూ.350 నుంచి రూ.400 మధ్య కోట్‌ చేసి టెండర్‌ దక్కించుకుంటున్నారు. గిట్టుబాటు కోసం నెయ్యిని కల్తీని చేస్తున్నారు. ఈ విషయం ఆలయ అధికారులకు తెలిసినా చూసీచూడనట్టుగా పోయారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం బయటకు వచ్చాక...సింహాచలంలో ఏమి జరుగుతోంది? అంటూ 2024 సెప్టెంబరులో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. కిలో రూ.591కి సరఫరా చేస్తున్న విశాఖ డెయిరీని పక్కనపెట్టి, 2022-23లో కిలో రూ.393.30కే సరఫరా చేస్తామని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీమియర్‌ ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌ సంస్థ ముందుకు రావడంతో 54 వేల కిలోల ఆర్డర్‌ ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విశాఖకు చెందిన సూర్యకుమారి ఏజెన్సీ కిలోకు రూ.529 కోట్‌ చేయగా కాంట్రాక్టు వారికి ఇచ్చారు. ఆ సంస్థ నుంచి 26,430 కిలోలు కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతు డెయిరీ కిలో రూ.344కే కోట్‌ చేసింది. వారికి 47,175 కిలోలకు ఆర్డర్‌ ఇచ్చారు. సింహాచలం ప్రసాదం నాణ్యంగా లేదని ఫిర్యాదులు రావడంతో ఏ నెయ్యి వాడుతున్నారో అంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయానికి వెళ్లి అన్నీ పరిశీలించారు. నెయ్యి వాసన లేకపోవడంతో వెంటనే ఫుడ్‌ సేఫ్టీ అధికారులను పిలిపించి శాంపిళ్లు తీయించి పరీక్షకు పంపించారు. అక్కడి నెయ్యి డబ్బాలన్నింటిని (945 కిలోలు) సీజ్‌ చేశారు. నివేదిక ఏమి వచ్చిందో తెలియదు గానీ 27 డబ్బాల నెయ్యిని వెనక్కి పంపించేశారు. ఆ వెంటనే విశాఖ డెయిరీ నుంచి కిలో రూ.605 చొప్పున కొనుగోలు చేశారు. 2025 డిసెంబరు వరకు ఆ డెయిరీ నుంచే నెయ్యి వచ్చింది. 2026 జనవరి నుంచి సంగం డెయిరీ నుంచి తీసుకుంటున్నారు. వారు కిలో రూ.649.90 చొప్పున ఇస్తున్నారు. డెయిరీని ఎందుకు మార్చారో, రేటు ఎందుకు పెరిగిందో తెలియదు. టెండర్‌ ప్రకారమే ఇచ్చామని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

నెయ్యిలో లోపం లేదట

సింహాచలం దేవస్థానానికి రైతు డెయిరీ కిలో రూ.344 చొప్పున సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి లోపాలు కనిపించలేదని అధికార వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి. నివేదిక బాగానే వచ్చిందని పేర్కొన్నారు. అలాగైతే తక్కువ ధరకు వస్తున్న ఆ నెయ్యిని కొనకుండా రెట్టింపు ధర పెట్టి ఇతర డెయిరీల నుంచి నెయ్యిని ఎందుకు కొంటున్నారంటే మాత్రం సమాధానం చెప్పలేదు. నివేదికలో ఏమీ లేనందున ఏ అధికారిపైనా చర్యలు తీసుకోలేదని సమర్థించుకుంటున్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పుడు లోపాలు లేకుండా చూసుకుంటున్నామని మరో అధికారి తెలిపారు.

Updated Date - Feb 08 , 2026 | 01:26 AM