మత్తు వీడింది.. మన్యం దారి మళ్లింది
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:32 PM
ఒకప్పుడు గంజాయి సాగుకు నిలయంగా ఉండే అల్లూరి జిల్లా మన్యం మత్తు వదిలి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దారి మళ్లింది. గంజాయి సాగు, రవాణాలపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడం కూడా ఇందుకు కారణమైంది. గంజాయి సాగుపై పోలీసులు డ్రోన్ నిఘా చాలావరకు ఉపయోగపడింది. ఫలితంగా గిరిజనుల్లో మార్పు వచ్చి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు.
గంజాయి వీడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై గిరిజనుల మొగ్గు
కూటమి ప్రభుత్వ చర్యలతో మారిన సీన్
నిరంతరం డ్రోన్ల నిఘాతో వచ్చిన మార్పు
ఆపరేషన్ వజ్రపహార్, త్రిశూల్‌తో సత్ఫలితాలు
కొయ్యూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):
ఏజెన్సీలో గంజాయి సాగుకు కేంద్రంగా ఉండే కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లోని గిరిజనులకు మత్తు వదిలింది. మారుమూల కొండలపై గల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసే గిరిజనులు ప్రస్తుతం వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో కాఫీ, రాజ్‌మా, అపరాలు, సామలు, రాగుల పంటలు దర్శనమిస్తున్నాయి. పోలీసులు ప్రతీ రోజూ డ్రోన్ కెమెరాలతో ఏరియల్ సర్వే చేస్తుండడంతో గంజాయి మొక్క కూడా దొరకనంతగా మార్పు వచ్చింది. ప్రభుత్వం రాజ్‌మా, కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజన రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుండడం కూడా వారిలో మార్పు వచ్చింది. ఈ పంటల ద్వారా గిరిజనులకు వస్తున్న ఆదాయం సంతృప్తికరంగా ఉంటోంది. దీనికితోడు పోలీసులు గంజాయి సాగు, రవాణా చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో సాగుకు అడ్డుకట్ట పడింది. ఒకప్పుడు గంజాయి సాగు, రవాణాకు కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీతోపాటు దానికి ఆనుకుని ఉన్న జీకే వీధి, చింతపల్లి మండలాలకు చెందిన మరికొన్ని పంచాయతీల గ్రామాలు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. మైదాన ప్రాంతాల వ్యాపారులు స్థానిక గిరిజన యువతను ప్రలోభ పెట్టి కొనుగోలు, రవాణాకు వినియోగించుకుంటూ మైదానానికి తరలించేవారు. ఇటీవల ఈ చర్యలపై పోలీసుల నిఘా పెరగడంతో గిరిజన యువత ముందుకు రావడం లేదు. పోలీసుల కేసులు, జైలుకు వెళ్లడంతో గంజాయి రవాణా చాలా వరకు నిలిచింది. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో గంజాయి సాగు నిర్ధారించేందుకు డ్రోన్‌ల ద్వారా ఏరియల్ సర్వే చేపడుతుండడంతో సాగుకు గిరిజనులు భయపడే పరిస్థితులు నెలకొనడం కూడా మార్పుకు ఒక కారణమైంది. దీంతో గడిచిన రెండున్నర సంవత్సరాలుగా గిరిజన రైతులు గంజాయి సాగును పూర్తిగా వదలి వాణిజ్య పంటలపై దృష్టి సారించారు. దీంతో గతంలో గంజాయి సాగుకు వినియోగించే భూముల్లో కాఫీ సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేని ప్రాంతాలలో అపరాలు, చోడి, సామ, రాజ్‌మా వంటి ప్రత్యామ్నాయ పంటలను గిరిజనులు సాగు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఆపరేషన్ వజ్రపహార్‌లో భాగంగా మూరుమూల గిరిజన గ్రామాలలో గంజాయి సాగుతో కలిగే అనర్ధాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తుండడంతో మన్యం మత్తు వీడే పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తే గంజాయి సాగు అడ్రస్ లేకుండా పోతుందని పలువురు అంటున్నారు.