Share News

గిరి రైతుల ప్రయోజనాలే ముఖ్యం

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:15 PM

గిరిజన రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు.

గిరి రైతుల ప్రయోజనాలే ముఖ్యం
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌ కుమార్‌

జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌ కుమార్‌

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి

కాఫీ గింజలను రైతులు జీసీసీకే విక్రయించాలి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం ఆయన జీసీసీ కార్యకలాపాలపై సంస్థ ఉద్యోగులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ల వారీగా జీసీసీలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, సేకరణ, నిర్వహణ అంశాలను తెలుసుకున్నారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, కాఫీ గింజల కొనుగోలు, పెట్రోలు బంక్‌ల నిర్వహణపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేకరణ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలన్నారు. అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన రైతులకు జీసీసీ ద్వారా ఆదాయం పెరిగేలా ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజన రైతులకు చేరేలా పనిచేయాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోస పోవద్దని, జీసీసీకి కాఫీ అమ్మకాలు చేయాలని రైతులను కోరారు. పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీసీసీ హెడ్‌ ఆఫీస్‌ అధికారులు ఉమాదేవి, త్రినాథ్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పాడేరు డీఎం కృష్ణప్రసాద్‌, చింతపల్లి డీఎం సింహాచలం, బ్రాంచ్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:15 PM