తీరనున్న తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:23 PM
మండల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనున్నది. చింతపల్లితో పాటు నాలుగు పంచాయతీల పరిధిలో ఉన్న 32 గ్రామాల ఆదివాసీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రూ.22 కోట్లతో రక్షిత మంచినీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం
కుమ్మరివంచుల వాగు నుంచి నీరు శుద్ధి చేసి సరఫరా
చింతపల్లితో పాటు మరో నాలుగు పంచాయతీల ప్రజలకు తీరనున్న ఇబ్బందులు
తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల చర్యలు
చింతపల్లి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మండల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనున్నది. చింతపల్లితో పాటు నాలుగు పంచాయతీల పరిధిలో ఉన్న 32 గ్రామాల ఆదివాసీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కుమ్మరివంచుల వాగు నుంచి చింతపల్లి వరకు రూ.22 కోట్ల జల్ జీవన్ మిషన్(జేజేఎం) నిధులతో భారీ రక్షిత మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మూడు ఎత్తైన ప్రాంతాల్లో జీఎల్‌బీఆర్ ట్యాంక్‌లు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు నీరు సరఫరా చేయనున్నారు. ఈ పథకం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐదు పంచాయతీలను కలుపుతూ 58 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించనున్నారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి జేజేఎం పథకం అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
చింతపల్లి మండల కేంద్రంతో పాటు మరో నాలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఆదివాసీలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు జల్‌జీవన్ మిషన్ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి 2025 ఏప్రిల్ 21న కూటమి ప్రభుత్వం సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చిలో జేజేఎం మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొత్తపల్లి జలపాతం, తాజంగి రిజర్వాయర్ నుంచి దిగువకు వస్తున్న కుమ్మరివలస వాగు వద్ద ఇన్‌ఫిల్టరేషన్ బావి, కలెక్షన్ బావి, 100మీటర్ల ఇన్‌ఫిల్టరేషన్ గ్యాలరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాగు వద్ద జలాలను శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేయనున్నారు.
తీరనున్న నీటి సమస్య
చింతపల్లి మేజర్ పంచాయతీతో పాటు తమ్మంగుల, అన్నవరం, చౌడుపల్లి, కుముడుసారి పంచాయతీ పరిధిలో ఉన్న ఆదివాసీలకు నీటి కష్టాలు తీరనున్నాయి. చింతపల్లి మండల కేంద్రంలో ఎనిమిది వేలు, పరిసర గ్రామాల్లో మూడు వేలు, తమ్మంగుల, అన్నవరం, చౌడుపల్లి, కుడుముసారి పంచాయతీ పరిధిలో తొమ్మిది వేల మంది ఆదివాసీలు నివాసముంటున్నారు. చింతపల్లి మండల కేంద్రం ప్రజలకు పదేళ్ల క్రితం నిర్మించిన సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా కారణంగా ఈ పథకం ద్వారా ప్రజలందరికి పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగడంలేదు. ఏప్రిల్ నుంచి జూన్ రెండో పక్షం వరకు చింతపల్లి ప్రజలు తీవ్ర స్థాయిలో మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సీపీడబ్ల్యూ పథకానికి నీటి సరఫరా చేసే బావులు అడుగంటిపోవడం వల్ల పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో వీధుల్లో నీటి సరఫరా చేయాల్సి వస్తున్నది. తమ్మంగుల, అన్నవరం, చౌడుపల్లి, కుడుముసారి పంచాయతీ పరిధి గిరిజనులు మంచినీటి కోసం ఊటగెడ్డలు, బావులు, చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన భారీ రక్షిత మంచినీటి పథకం అందుబాటులోకి వస్తే ఇరవై వేల జనాభాకు నీటి సమస్య పరిష్కారమవుతుంది.
58 కిలోమీటర్ల పైపులైన్లు, మూడు జేఎల్‌బీఆర్‌లు
చింతపల్లితో పాటు మరో నాలుగు పంచాయతీల ప్రజలకు మంచినీరు సరఫరా చేసేందుకు కొత్తపల్లి జలపాతం, తాజంగి రిజర్వాయర్ నుంచి దిగువకు వస్తున్న నీరు కలిసే కుమ్మరవంచుల నుంచి చింతపల్లి వరకు నీరు సరఫరా చేసేందుకు 58 కిలోమీటర్లు పైపులైన్లు, మూడు గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్) నిర్మించనున్నారు. కుమ్మరివంచుల వాగు వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఆరు మీటర్ల చుట్టుకొలత కలిగిన ఇన్‌ఫిల్టరేషన్ బావి నిర్మిస్తారు. ఇన్‌ఫిల్టరేషన్ బావికి 100 మీటర్ల ఇన్‌ఫిల్టరేషన్ గ్యాలరీ ద్వారా శుద్ధ జలం చేరుతుంది. ఇన్‌ఫిల్టరేషన్ బావిలో శుద్ధిచేసిన జలాలు 30 మీటర్లు పక్కనే ఉన్న కలెక్షన్ బావి వద్దకు చేరుతుంది. ఈ కలెక్షన్ బావి నుంచి శుద్ధి చేసిన నీరు మోటార్ల సహాయంతో కోటగున్నలు కొండపైన నిర్మించే 200 కేఎల్ జీఎల్‌బీఆర్‌కి పంపింగ్ చేస్తారు. ఈ జీఎల్‌బీఆర్ పరిధిలో ఉన్న సుమారు 11 గ్రామాల నీటి ట్యాంక్‌లకు నీరు సరఫరా చేస్తారు. అలాగే కోటగున్నలు జీఎల్‌బీఆర్‌కి వచ్చిన నీటిని సంపు-1కి తరలించి బైలుకించంగి కొండపైన నిర్మించనున్న రెండవ 250 కేఎల్ జీఎల్‌బీఆర్‌కి తరలిస్తారు. బైలుకించంగి రెండవ జీఎల్‌బీఆర్ పరిధిలో ఉన్న మరో 12 గ్రామాలకు నీటి సరఫరా చేస్తారు. అలాగే బైలుకించంగి రెండవ జీఎల్‌బీఆర్‌కి వచ్చిన నీటిని చుంచుంపూడి సంపు-2 పంపింగ్ చేస్తారు. సంపు-2 నుంచి చింతపల్లి సాయినగర్ కొండపైన నిర్మించే మూడవ 150 కేఎల్ జీఎల్‌బీఆర్‌కి నీరు పంపిస్తారు. చింతపల్లి మూడవ జీఎల్‌బీఆర్ ద్వారా మండల కేంద్రంతో పాటు ఆరు గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. ఒక్కొక్క జీఎల్‌బీఆర్ పరిధి గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లు నిర్మిస్తారు. జీఎల్‌బీఆర్ నుంచి గ్రామాల పరిధిలోని మంచినీటి ట్యాంక్‌లకు నీరు సరఫరా చేసి, అక్కడ నుంచి పబ్లిక్ కొళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తారు. అలాగే చింతపల్లిలో ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇస్తారు.