Share News

మందులోళ్ల మాయ

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:47 AM

గడువు తీరిన మందులను కొందరు మార్కెట్‌లో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

మందులోళ్ల మాయ

కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న కొన్ని మెడికల్‌ స్టోర్స్‌, హోల్‌సేల్‌ షాపులు

స్ర్టిప్స్‌పై తేదీల మార్పు

గడువు తీరిన మందుల వినియోగంతో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్న వైద్యులు

విజయవాడలో అక్రమాలను గుర్తించిన ఔషధ నియంత్రణ అధికారులు

విశాఖలోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే గుట్టు బయటపడే అవకాశం

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

గడువు తీరిన మందులను కొందరు మార్కెట్‌లో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని మెడికల్‌ స్టోర్స్‌తోపాటు హోల్‌సేల్‌ దుకాణాలు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నాయి. విజయవాడలో డైకాన్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ గడువుతీరిన మందులను విక్రయిస్తున్నట్టు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. మధుమేహం, గ్యాస్ర్టిక్‌ వంటి సమస్యలకు వినియోగించే తొమ్మిది రకాల మందుల గడువు తేదీలు, ఇతర వివరాలను నకిలీ రబ్బరు స్టాంపు సాయంతో మార్చేసి విక్రయాలు సాగిస్తున్నట్టు తేలింది.

ఆకస్మిక తనిఖీలతో గుర్తించే చాన్స్‌

విశాఖ జిల్లాలోనూ అనేకచోట్ల ఇదే తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తే అన్నీ బయటకు వస్తాయి. కాలం చెల్లిన మందులను విక్రయించేందుకు అనేక మెడికల్‌ స్టోర్స్‌లో ప్రత్యేక పంథాను అనుసరిస్తుంటాయి. సాధారణంగా స్ర్టిప్‌తో ఇచ్చినప్పుడు మాత్రమే గడువు తేదీలు కనిపిస్తుంటాయి. అదే వాటిని మూడు, నాలుగు టాబ్లెట్లుగా విడదీస్తే గడువు తేదీలు కనిపించవు. ఇదే విధానాన్ని అనేకచోట్ల అవలంబిస్తున్నారు. కాబట్టి, గడువు తీరిన మందులను కొనుగోలు చేయకుండా ఉండాలంటే తప్పనిసరిగా పూర్తిస్థాయి స్ర్టిప్‌ తీసుకోవాలి. స్ర్టిప్‌ మీద వేసిన ముద్రలు కాస్త భిన్నంగా ఉన్నా, ప్రత్యేకంగా ముద్రణలు వేసినట్టున్నా అనుమానించాల్సిందే. గడువు తీరిన మందులను విక్రయించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు బారినపడేందుకు అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు అలర్జీలు, ఇతర రియాక్షన్స్‌ వస్తాయని, కాబట్టి, మందుల కొనుగోళ్లు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇటువంటి వాటికి చెక్‌ చెప్పేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. జిల్లాలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఈ తరహా దాడులను చేసిన సందర్భాలు అతి తక్కువే.

లైసెన్సు లేకుండానే వైద్యం

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పేరుతో ఎంతోమంది వైద్యం చేస్తున్నారు. వారిలో చాలామందికి లైసెన్సులు కూడా ఉండడం లేదు. అటువంటి వారిపై నిఘా పెట్టాల్సిన అధికారులు పట్టనట్టు ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నగర పరిధిలో ఎంతోమంది ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి అనుమతులు లేకపోయినా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. లైసెన్సులు లేకుండానే ఎంతోమంది పెయిన్‌ కిల్లర్‌ మందులు, ఇంజెక్షన్లు, యాంటీ బయాటిక్స్‌ ఇచ్చేస్తున్నారు. కొందరు వేల రూపాయల విలువచేసే మందులను స్టోర్‌ చేస్తున్నారు. వీటిపైనా అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 01:47 AM