Share News

ఐకానిక్‌ టవర్స్‌కు కొరవడిన స్పందన

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:46 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పెదరుషికొండలో నిర్మించ తలపెట్టిన 50 అంతస్థుల ఐకానిక్‌ టవర్స్‌కు బిల్డర్ల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు.

ఐకానిక్‌ టవర్స్‌కు కొరవడిన స్పందన

పెదరుషికొండలో 50 అంతస్థుల నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ ప్రతిపాదన

పీపీపీలో చేపట్టేందుకు ప్రణాళిక

ఇప్పటికి రెండుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క బిడ్‌ కూడా రాని వైనం

మరోసారి గడువు పొడిగింపు

మధ్య తరగతి ప్రజల కోసం నిర్మించ తలపెట్టిన

గేటెడ్‌ కమ్యూనిటీ మోడల్‌ ప్రాజెక్టుదీ అదే పరిస్థితి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పెదరుషికొండలో నిర్మించ తలపెట్టిన 50 అంతస్థుల ఐకానిక్‌ టవర్స్‌కు బిల్డర్ల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం కింద జాయింట్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌లో దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఆరు టవర్లు, ఒక్కొక్కటి 50 అంతస్థుల్లో నిర్మించాలనేది ప్రణాళిక. అంచనా వ్యయం రూ.690 కోట్లు.

పెద రుషికొండలో పెబ్బల్స్‌ బీచ్‌ అపార్టుమెంట్‌ పక్కన సర్వే నంబరు 331/1లో 4.07 ఎకరాలు దీని కోసం కేటాయించారు. అందులో 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే డ్యూప్లెక్స్‌ ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. కమ్యూనిటీ కోసం క్లబ్‌ హౌస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, పూల్‌ డెక్‌, సైకిల్‌ ట్రాక్‌, జాగింగ్‌ ట్రాక్‌ తదితర అత్యాధునిక వసతులు వస్తాయి. గత జూలైలో దీనికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ పిలిచారు. ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ తరువాత మరోసారి గడువు పెంచారు. అప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ తరువాత పెట్టుబడిదారుల సదస్సు ఉందని కొన్నాళ్లు పక్కన పెట్టారు. ఆ తరువాత మళ్లీ టెండర్లు పిలిచారు. అంతా వచ్చి మాట్లాడి, వివరాలు తెలుసుకొని వెళుతున్నారే తప్ప ఒకరు కూడా బిడ్‌ వేయడం లేదు. డిసెంబరు నెలాఖరు వరకు చూసి, ఎవరూ రాకపోవడంతో జనవరి నెలాఖరు వరకు గడువు పెంచారు. ఇప్పుడు మళ్లీ ఈ నెల 16వ తేదీ వరకు గడువు పొడిగించారు.

అక్కడా అదే పరిస్థితి

మధురవాడ, మిథిలాపురి వుడా కాలనీ, వేపగుంట, పెందుర్తి ప్రాంతాల్లో మధ్య తరగతి ప్రజల కోసం గేటెడ్‌ కమ్యూనిటీ మోడల్‌లో అపార్టుమెంట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది కూడా పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యమే. ఇందులో 2 బీహెచ్‌కె, 2.5 బీహెచ్‌కు, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు వస్తాయి. వీటికి రూ.124 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. డెవలపర్‌ ముందుకు వచ్చి అపార్టుమెంట్లు నిర్మించి, వీఎంఆర్‌డీఏ వాటాకు తగిన ఫ్లాట్లు ఇవ్వాలనేది షరతు. అయితే ఈ ప్రాజెక్టుకు కూడా డెవలపర్లు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

రాజకీయ జోక్యం అయితే నష్టమే...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎండాడలో శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ ప్రాజెక్టును ఈ విధంగానే జాయింట్‌ వెంచర్‌ కింద చేపట్టారు. అప్పుడు ఆయన తోడల్లుడు అయిన వైవీ సుబ్బారెడ్డి గ్లోబల్‌ ఎంట్రోపాలిస్‌ పేరుతో ఆ ప్రాజెక్టును దక్కించుకున్నారు. దానిని ఏడాది తిరగకుండానే శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ గ్రూపునకు రూ.200 కోట్ల లాభానికి అమ్మేసుకున్నారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు వీఎంఆర్‌డీఏ ప్రకటించిన ప్రాజెక్టులకు ఎవరూ ముందుకు రాకపోతే వాటిని రద్దు చేసి, ఆ భూములను వేరే అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. పదే పదే బిడ్డింగ్‌ అని ప్రకటిస్తే...చివరకు ఏ నాయకుడో చెప్పాడని పైరవీకారులు ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. దాని వల్ల మధ్య తరగతి ప్రజలకు ఏమీ మిగలదు. కాబట్టి ఎవరూ రాకపోతే కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - Feb 06 , 2026 | 12:46 AM