మన్యంలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:21 AM
మన్యంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు.
వరుస సెలవుల నేపథ్యంలో సందర్శకుల రద్దీ
అనుకూలించిన వాతావరణం
పాడేరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు. దీంతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా మారాయి. దీంతో ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూపాయింట్, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. దీంతో పర్యాటకులతో పాడేరు, అరకులోయ, తాజంగి, లంబసింగి ప్రాంతాలు సందడిగా మారాయి.
లంబసింగిలో
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. వారం రోజులుగా లంబసింగి పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం వర్షం కురుస్తున్నప్పటికీ ప్రకృతిని ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఆదివారం ఉదయం లంబసింగిలో వర్షం తెరిపిచ్చింది. దీంతో ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ పరిసరాల్లో సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అందమైన దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతాన్ని పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.