Share News

మన్యంలో పర్యాటకుల సందడి

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:59 PM

మన్యంలో పర్యాటకుల సందడి నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులతో పాటు రెండో శని, ఆదివారాలు సెలవులు కావడంతో అధిక సంఖ్యలో జనం మన్యం బాట పట్టారు.

మన్యంలో పర్యాటకుల సందడి
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు

వరుస సెలవులే కారణం

కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు

చెరువులవేనంలో మంచు అందాలకు సందర్శకులు ఫిదా

పాడేరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో పర్యాటకుల సందడి నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులతో పాటు రెండో శని, ఆదివారాలు సెలవులు కావడంతో అధిక సంఖ్యలో జనం మన్యం బాట పట్టారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి మొదలైంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, ఆయా ప్రాంతాల్లోని వలిసెలు పూల తోటలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. దీంతో అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొంది.

లంబసింగికి పర్యాటకుల తాకిడి

చింతపల్లి:ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం వద్ద ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన సందడి 11 గంటల వరకు సాగింది. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద మంచు అందాను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటింగ్‌ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. సాయంత్రం సందర్శకులతో స్ట్రాబెర్రీ తోటలు రద్దీగా కనిపించాయి. అలాగే యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.

Updated Date - Jan 10 , 2026 | 10:59 PM