మళ్లీ పర్యాటకుల సందడి
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:35 PM
అరకులోయలో ప్రకృతి అందాలను తిలకించేందుకు శనివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.
కిటకిటలాడిన సందర్శిత ప్రాంతాలు
ప్రకృతి అందాలను ఆస్వాదించిన సందర్శకులు
ధింసా కళాకారులతో నృత్యాలు
అరకులోయ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో ప్రకృతి అందాలను తిలకించేందుకు శనివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. ఒకవైపు మంచు అందాలు.. మరోవైపు చలి పలకరింత.. ఇంకోవైపు వలిసిపూల సోయగం.. ఆపై గలగల పారే జలపాతాలు సందర్శకులను కనువిందుజేశాయి. తెల్లవారక ముందే మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్దకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి సందడి చేశారు. పాల సముద్రాన్ని తలపించే భల్లుగుడ లోయలు సందర్శకులను ఆనందపరిచాయి. మంచు తెరలను చీల్చుకుంటూ భానోదయాన్ని తిలకిస్తూ.. ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. వ్యూపాయింట్ వద్ద సందర్శకులు గిరిజన ధింసా కళాకారులతో నృత్యం చేశారు. సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జిను పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించారు, గాలికొండ వ్యూపాయింట్, అరకులోయలో ట్రైబల్‌మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌లను సందర్శించారు. పర్యాటకుల రాకతో అరకులోయలో వ్యాపారాలు బాగా సాగాయి.
లంబసింగికి పర్యాటకుల తాకిడి
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచే చెరువులవేనం వ్యూపాయింట్, లంబసింగి జంక్షన్, భీమనాపల్లి, తాజంగి జలాశయంలో పర్యాటకులు సందడి చేశారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు మంచు అందాలను ఆస్వాదిస్తూ 11 గంటల వరకు ఎంజాయ్ చేశారు. ప్రకృతి సోయగాలను కెమెరాలో బంధించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతాన్ని సైతం పర్యాటకులు సందర్శించారు.