Share News

తిరుగు ప్రయాణాల సందడి

ABN , Publish Date - May 20 , 2026 | 11:41 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగియడంతో జనం బుధవారం స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

తిరుగు ప్రయాణాల సందడి
బస్టాండ్‌కు బయలుదేరుతున్న దృశ్యం

మోదకొండమ్మ ఉత్సవాలు ముగియడంతో స్వస్థలాలకు బయలుదేరిన జనం

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన అధికారులు

వాహనాలతో కిక్కిరిసిన వీధులు

పాడేరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగియడంతో జనం బుధవారం స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. మైదాన ప్రాంతంలో తీవ్రమైన ఎండల నేపథ్యంలో మోదకొండమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఉత్సవాలకు వారం ముందే ఇక్కడికి వచ్చారు. వారం రోజులు పాడేరులోనే బంఽధువుల ఇళ్లల్లో ఉండి ఉత్సవాలను చూసుకుని బుధవారం తమ స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో పాడేరు నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన ప్రయాణికులు బస్సులు, ప్రైవేటు జీపులను ఆశ్రయించారు. కొందరు తమ సొంత వాహనాల్లో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పాడేరులోని సందుల్లో సైతం భారీగా వాహనాల రాకపోకలు సాగాయి. దీని వలన జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.

కిక్కిరిసిన బస్సులు

పాడేరురూరల్‌: మోదకొండమ్మ ఉత్సవాలు ముగియడంతో జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన జనం బుధవారం తిరుగు ప్రయాణం కావడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పాడేరు డిపో జిల్లా మేనేజర్‌ పసగాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపారు. బుధవారం పాడేరు డిపో నుంచి విశాఖ, అనకాపల్లి, చోడవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, రంపచోడవరం, తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు నడిపారు. మోదకొండమ్మ ఉత్సవాల్లో బందోబస్తుకు మైదాన ప్రాంతం నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి డిపో నుంచి ప్రత్యేక బస్సులను డీఎం శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు.

Updated Date - May 20 , 2026 | 11:41 PM