బైకర్ల హల్‌చల్
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:49 AM
నగరంలో ఆకతాయిగా తిరిగే యువకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.
నిశిరాత్రిలో హంగామా
నగరంలో పెచ్చుమీరుతున్న రిప్‌రేసర్ల ఆగడాలు
శని, ఆదివారాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపైకి హైస్పీడ్ బైక్‌లతో పదుల సంఖ్యలో చేరుతున్న వైనం
నంబర్‌ప్లేట్లు తీసేసి జిగ్‌జాగ్‌లు, హైస్పీడ్, స్టంట్‌లు
ఇతర వాహనచోదకుల్లో భయాందోళనలు
జాతీయరహదారి వేదికగా కార్యక్రమాలు
చోద్యంచూస్తున్న రాత్రిగస్తీ పోలీసులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో ఆకతాయిగా తిరిగే యువకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత హైస్పీడ్‌బైక్‌లతో పదుల సంఖ్యలో రోడ్లపైకి చేరి హల్‌చల్ చేస్తున్నారు. హైస్పీడ్, విపరీతమైన శబ్దంతో రోడ్లపై స్టంట్‌లు చేస్తూ ఒకేసారి గుంపులుగా దూసుకుపోతున్నారు. అదే సమయంలో జాతీయరహదారిపై రాకపోకలు సాగించే వాహనచోదకులు మెరుపువేగంతో దూసుకెళుతున్నవారిని చూసి భాయాందోళన చెందుతుఉన్నారరు. పోలీసులు రాత్రిగస్తీలో ఉన్నా వీరిని పట్టించుకోకపోవడంతో రిప్‌రేసర ఆగడాలకు అడ్డులేకుండాపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరైనా బయటకు వెళితే వారికి కొత్త ప్రపంచం కనిపిస్తోంది. కొందరు యువకులు, ఆకతాయిలు వైజాగ్ రేసర్లు, రిప్‌రేసర్లు, వైజాగ్ సన్‌రైజర్స్ వంటి పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ చేరాలనేది అప్పటికప్పుడు నిర్ణయించుకుని క్షణాల్లో వేర్వేరుమార్గాల్లో అక్కడకు చేరుతున్నారు. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత డూక్, యమహా ఎక్స్‌జెడ్, డియో, నియో వంటి హైస్పీడ్ బైక్‌లతో బీచ్‌రోడ్డు, బీఆర్‌టీఎస్‌రోడ్డు, స్వర్ణభారతి జంక్షన్, డీఆర్‌ఎంకాలనీ ప్రాంతాలకు చేరుతున్నారు. అక్కడ వాహనాలతో స్టంట్‌లు, సౌండ్‌లు, జిగ్‌జాగ్‌లుచేస్తూ అరాచకమే సృష్టిస్తున్నారు.
నిఘా పెరగడంతో...
ఐటీహిల్స్ రోడ్డు, బీచ్ రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్డుల్లో ఇలాంటి వారి ఆరాచకాలు నిత్యకృత్యం కావడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. శని,ఆదివారాల్లో వీరి ఆగడాలు మరింత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక బృందాలు నిఘా ముమ్మరం చేశాయి. దీంతో రేసర్లు, రిప్‌రేసర్లు ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న జాతీయరహదారి, డీఆర్‌ఎం ఆఫీస్, రైల్వేస్టేషన్ రోడ్డుపై పడుతున్నారు. కొన్నాళ్ల కిందట స్వర్ణభారతి స్టేడియం వద్ద వందల సంఖ్యలో బైక్‌రేసర్లు చేరి ఆ సమయంలో రోడ్డుపై వస్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. పక్కకు జరగాలని కోరుతూ హారన్‌కొట్టిన బస్‌డ్రైవర్‌పై దాడికి పాల్పడడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కొన్నాళ్ల కిందట రుషికొండ నుంచి సీతకొండ వైపు రాత్రివేళ హైస్పీడ్‌బైక్‌పై అపరిమితవేగంతో కొందరు యువకులు దూసుకెళుతుండగా ఒకరిబైక్ అదుపు తప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో పోలీసులు బీచ్‌రోడ్డులో శని,ఆదివారాల్లో రాత్రిపూట నిఘా పెంచారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు రేసర్లు గతనెలరోజులుగా అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి, ఇన్‌ఆర్బిట్‌మాల్ రోడ్డు నుంచి జాతీయరహదారి మీదుగా తాటిచెట్లపాలెం జంక్షన్ వరకు హల్‌చల్ చేస్తున్నారు. అపరిమితవేగంతో బైక్‌లపై దూసుకువచ్చి జాతీయ రహదారిపై జిగ్‌జాగ్‌లు, స్టంట్‌లుచేసి నిప్పురవ్వలు కురిపిస్తుండడంతో ఆ సమయంలో రాకపోకలు సాగించే ఇతర వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు. కళ్లుమూసి తెరిచేలోపే తమ పక్క నుంచి శబ్దం చేసుకుంటూ వెళ్లిపోతుండడంతో ఏంజరుగుతోందో తెలియక వాహనాన్ని ఆపి స్థిమితపడిన తర్వాత ముందుకెళుతున్నారు.
నిఘా పెంచుతాం
నగరంలో రిప్‌రేసర్ల కదలికలు బీచ్‌రోడ్డు, ఐటీ హిల్స్‌రోడ్డులో ఉండడంతో అక్కడ దృష్టిపెడుతున్నాం. తాజాగా నగరంలో హల్‌చల్ చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో నిఘా పెడతాం. ఇప్పటికీ ప్రతి శనివారం గస్తీపెట్టి పది నుంచి 20 మంది బైకర్లను అదుపులోకి తీసుకుంటున్నాం. వారిపై కేసులు నమోదుచేసి, బైక్‌లను సీజ్‌చేస్తున్నాం. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాతే వాహనాన్ని వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలపై దృష్టిపెట్టాలి.
-ఎ.నర్సింహమూర్తి, ట్రాఫిక్ ఏడీసీపీ