పోర్టు ఆధీనంలోనే ఆస్పత్రి
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:11 AM
అక్కయ్యపాలెంలోని గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రిని ప్రైవేటుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెనక్కి తీసుకుంది.
ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన యాజమాన్యం
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రం కాంట్రాక్టుకు ఇవ్వాలని నిర్ణయం
ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకురావాలంటూ ప్రకటన
విధి విధానాలు వెల్లడించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అక్కయ్యపాలెంలోని గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రిని ప్రైవేటుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెనక్కి తీసుకుంది. అయితే నిర్వహణ బాధ్యతలను మాత్రం కాంట్రాక్టుకు ఇస్తామంటూ ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ (ఓ అండ్ ఎం)కు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు రావాలంటూ తాజాగా ప్రకటన జారీచేసింది. విధివిధానాలు వెల్లడించకుండా 40 వేల మందికి సేవలు అందించే ఆస్పత్రిని ఓ అండ్ ఎంకు ఎలా ఇస్తారంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
విశాఖపట్నం పోర్టులో పనిచేసే ఉద్యోగులు, సీఐఎస్‌ఎఫ్, పూల్ కలాసీలు, అధికారులు, పదవీ విరమణ చేసిన వారికి వైద్య సేవలు అందించేందుకు అక్కయ్యపాలెంలో ‘గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రి’ని 1984లో నిర్మించారు. దాని సామర్థ్యం 150 పడకలు. ఒకప్పుడు చక్కటి వైద్యసేవలు అందేవి. అన్నిరకాల ఆపరేషన్లు జరిగేవి. అయితే సిబ్బందిని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో అటు పోర్టులోను, ఇటు ఆస్పత్రిలోను దానిని అమలు చేశారు. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. అదేవిధంగా పోర్టు కేవలం వ్యాపారంపైనే దృష్టి సారించాలని, ఇతర అంశాలను తగ్గించుకోవాలని పైనుంచి ఒత్తిడి రావడంతో ఆస్పత్రిని ప్రైవేటుపరం చేయాలని చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో పడకలను 150 నుంచి 80కి తగ్గించేశారు. ఆపరేషన్ల సంఖ్య కూడా పడిపోయింది. ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు పోర్టు చైర్మన్‌గా ఉన్నప్పుడు పీపీపీకి రంగం సిద్ధం చేశారు. ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురు కావడంతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత వచ్చిన చైర్మన్ రామ్మోహన్‌రావు ఇన్‌ఆర్బిట్ మాల్‌కు భారీగా పోర్టు భూములు ఇచ్చారు. అదే ఊపులో ఆస్పత్రిని కూడా పీపీపీలో ఇచ్చేయాలని యత్నించారు. ఉద్యోగులు మళ్లీ అడ్డం పడ్డారు. ఈ క్రమంలోనే యాజమాన్యం గత ఏడాది జూలైలో పీపీపీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 80 పడకల ఆస్పత్రిని 100 పడకలు చేయాలని, ఆస్పత్రి మొత్తం ప్రైవేటు సంస్థ చూసుకోవాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత సేవలు అందించి, బయట వారి నుంచి ఫీజులు తీసుకోవచ్చునని ప్రకటించింది. దీనిని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆస్పత్రి ముందు రిలే నిరాహార దీక్షలు చేశాయి. సుమారు ఆరు నెలలు పట్టు వదలకుండా సంఘాలు పోరాటం చేయడంతో పోర్టు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ మేరకు గత నెలలో కేంద్రానికి లేఖ రాసింది. పీపీపీలో ఇవ్వలేమని, ఓ అండ్ ఎం మాత్రం ఇస్తామని పేర్కొంది. దాని ప్రకారం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు రోజుల క్రితం లైట్ హౌస్ ఉత్సవాల కోసం ఢిల్లీ నుంచి కేంద్ర సెక్రటరీ విజయకుమార్ దృష్టికి కూడా ఈ సమస్య తీసుకువెళ్లారు. ఓ అండ్ ఎంకి ఇచ్చినా ఆస్పత్రిపై పూర్తి నియంత్రణ పోర్టు యాజమాన్యం చేతిలోనే ఉంటుందని ఆయన వెల్లడించారు.
నిబంధనలు ఏమిటో వెల్లడించాలి
పద్మనాభరాజు, సీఐటీయూ నాయకులు
పోర్టు ఆస్పత్రిని ఓ అండ్ ఎంకు ఇవ్వదలుచుకుంటే అందులో ఎటువంటి నిబంధనలు పెట్టారో వెల్లడించాలి. వాటిని పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తాం. ఉద్యోగులకు నష్టం కలిగేలా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మళ్లీ పోరాటం ప్రారంభిస్తాం.