Share News

గిరి రైతు పంట పండింది

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:48 PM

లోకమంతా ఎల్‌నినో ప్రభావంతో అల్లాడుతుంటే.. మన్యంలో మాత్రం అందుకు భిన్నంగా ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు ఆశాజనకంగా పండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు వేసిన వరి, రాగులు, సామ పంటలు బాగా పండాయి. వాస్తవానికి ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెల వరకు వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. కాని సెప్టెంబరు నెలలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఖరీఫ్‌ పంటలకు జీవం పోసినట్లైంది.

గిరి రైతు పంట పండింది
పాడేరు మండలం లగిశపల్లి వద్ద కోత దశకు వచ్చిన వరి పంట

మన్యంలో ఆశాజనకంగా ఖరీఫ్‌ సాగు

సెప్టెంబరులో కురిసిన వర్షాలతో ఎంతో మేలు

43,100 హెక్టార్లలో వరి, 19,154 హెక్టార్లలో రాగి, 4,869 హెక్టార్లలో సామ

పంటలు బాగా పండడంతో రైతుల ఆనందం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీలో పూర్తిగా వర్షాధారంపైనే ఖరీఫ్‌ పంటల సాగు సాగుతుంది. ఈ సీజన్‌లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వర్షాలు కురవకపోతే పంటలు దెబ్బతినే ప్రమాదముంది. కాని ఈ ఏడాది అన్నదాతల అదృష్టం బాగుండడంతో పరిస్థితి అనుకూలించింది. దీంతో మరో వారం, పది రోజుల్లో కోతలు చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఇకపై ఎటువంటి ప్రతికూల వాతావరణం ఏర్పడినా పంటలు తమ చేతి వచ్చే అవకాశముందని గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల ప్రధాన ఆహార పంటలు రాగులు, సామ

ఏజెన్సీలోని గిరిజనులు వరి తర్వాత ప్రధాన ఆహార పంటలుగా రాగులు, సామలనే వినియోగిస్తారు. దీంతో గిరిజనులు ప్రతి ఏడాది ఖరీఫ్‌లో వరి, రాగులు, సామ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అందుకే జిల్లాలో ఖరీఫ్‌లో 43,100 హెక్టార్లలో వరి, 19,154 హెక్టార్లలో రాగులు, 4,869 హెక్టార్లలో సామ పంటలను సాగు చేస్తున్నారు. గిరిజనులు కేవలం రెండు పూటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. దానిలో వరి అన్నం తక్కువగా తీసుకోవడంతోపాటు రాగుల జావను తాగుతారు. సామ అన్నం తింటారు. ఈ రెండు చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడంతో కొవ్వు పెరగకపోవడంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే గిరిజనులకు వాటి వినియోగంతో కలిగే లాభాలు సంపూర్ణంగా తెలియనప్పటికీ, తరతరాలుగా చిరుధాన్యాలను సాగు చేసుకుని ఆహారం తీసుకుంటుండడంతో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పైగా చిరుధాన్యాల సాగుకు ఖర్చు సైతం తక్కువగా ఉంటుంది. దీంతో గిరిజన రైతులు తమ ఆహార పంటగా రాగులు, సామ సాగుపై దృష్టి సారిస్తున్నారు.

సెప్టెంబరులో అనుకూలంగా వానలు

జిల్లాలో ఏప్రిల్‌, మే నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో వేసవి దుక్కులు పూర్తి కాగా.. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో వానలు కురవలేదు. ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జీకేవీధి మండలాల్లో ఆశాజనకంగా, మిగిలిన మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన వర్షాలు కురవనప్పటికీ.. సెప్టెంబరులో కురిసిన వర్షాలు ఖరీఫ్‌ పంటలకు సంపూర్ణంగా జీవం పోశాయి. వాస్తవానికి ఆగస్టు వరకు ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ పంటలపై గిరిజన రైతులు ఆశలు సన్నగిల్లాయి. కాని అందుకు భిన్నంగా సెప్టెంబరులో కురిసిన వర్షాలు పూర్తి స్థాయిలో ఆదుకున్నాయి. దీంతో ప్రస్తుతం వరి, రాగులు, సామ పంటలు కోత దశకు చేరుకున్నాయి. దీంతో ఏజెన్సీలో ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నది.

జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షపాతం వివరాలు

వ.సం నెల పేరు సాధారణ వర్షపాతం కురిసిన వర్షం(మి.మీ)

1. జూన్‌ 155 109

2. జూలై 203 202

3 ఆగస్టు 202 80

4. సెప్టెంబరు 233 428

Updated Date - Nov 15 , 2026 | 11:48 PM