Share News

ఎండ ప్రచండం

ABN , Publish Date - Jun 11 , 2026 | 01:07 AM

తీవ్రమైన ఎండ, వడగాడ్పులతో బుధవారం జిల్లా మండిపోయింది. పడమర దిశ నుంచి వీచిన పొడిగాలులకు నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం, ఇదే సమయంలో వేడిగాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

ఎండ ప్రచండం

ఎండ తీవ్రత, వడగాడ్పులతో మండిన జిల్లా

ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

గాజువాక, మహారాణిపేట,

ములగాడల్లో 43.6 డిగ్రీలు నమోదు

ఎయిర్‌పోర్టులో 41.8 డిగ్రీలు

సాయంత్రానికి ఈదురుగాలులతో జల్లులు

విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి):

తీవ్రమైన ఎండ, వడగాడ్పులతో బుధవారం జిల్లా మండిపోయింది. పడమర దిశ నుంచి వీచిన పొడిగాలులకు నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం, ఇదే సమయంలో వేడిగాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరుబయట ఉన్నవారే కాకుండా ఇళ్లల్లో ఫ్యాన్ల కింద ఉన్న వారు పెనం మీద ఉన్నట్టుగా ఉడికిపోయారు. మధ్యాహ్నానికి వేడి మరింత పెరిగింది. భవన నిర్మాణ కార్మికులు, రోడ్లపై చిరు వ్యాపారులు, ఏసీ సదుపాయం లేని దుకాణాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గాడ్పుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా గాజువాక, మహారాణిపేట, ములగాడ, పద్మనాభం, పెందుర్తి, సీతమ్మధార, గోపాలపట్నం, విశాఖ రూరల్‌ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, ఆనందపురంలో వడగాడ్పులు వీచాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో ఈ సీజన్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

అయితే మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎండ తీవ్రత, ఉక్కపోత, సముద్రం నుంచి వీచిన గాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏర్పడిన మేఘాలు సాయంత్రానికి విశాఖ వైపు వచ్చాయి. దీంతో పెందుర్తి పరిసరాల్లో ఈదురుగాలులతో వర్షం కురింది. ఆ తరువాత గాలులు నగరంపైకి వీయడంతో వాతావరణం కాస్త చల్లబడింది. నగరంలో చిన్న జల్లు పడింది. పెందుర్తి శ్రామికనగర్‌లో 30.5, పద్మనాభనగర్‌లో 16 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jun 11 , 2026 | 01:07 AM