Share News

నేడు జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:05 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనున్నది.

నేడు జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

15 అంశాలతో అజెండా

గీతం విద్యా సంస్థలకు భూముల క్రమబద్ధీకరణ అంశంపైనే అందరి దృష్టి

అజెండా నుంచి ఆ అంశాన్ని తొలగించాలని విపక్షాల డిమాండ్‌

కౌన్సిల్‌హాల్‌లో హడావిడి చేయాలని వైసీపీ నిర్ణయం

జీవీఎంసీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనున్నది. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 15 అంశాలతో అజెండా తయారుచేసి సభ్యులకు పంపిణీ చేశారు. గీతం విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న 54.76 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు క్రమబద్ధీకరించే అంశాన్ని అజెండాలో చేర్చడంతో ఈ కౌన్సిల్‌ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గీతం సంస్థకు భూముల క్రమబద్ధీకరణను వైసీపీతోపాటు సీపీఐ, సీపీఎం వ్యతిరేకిస్తున్నాయి. ఆ అంశాన్ని కౌన్సిల్‌ అజెండా నుంచి తొలగించాలని కోరుతూ వైసీపీ, సీపీఎం కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్‌ పీలా శ్రీనివాసరావుతోపాటు జీవీఎంసీ అదనపు కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఇదే అంశంపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేసేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే సీపీఐ కూడా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుజాగ్రత్తగా జీవీఎంసీ ఎదుట పెద్దఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. అజెండా నుంచి గీతం భూముల అంశాన్ని తొలగించినట్టు ప్రకటించిన తర్వాత చర్చ ప్రారంభించాలని పట్టుబట్టాలని వైసీపీ కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే పోడియం వద్దకు వెళ్లి హడావిడి చేయాలని నేతల నుంచి కార్పొరేటర్లకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. వైసీపీ కార్పొరేటర్ల ఎత్తుకు కూటమి కార్పొరేటర్లు ఎలా పైఎత్తు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహ,ప్రతివ్యూహాలపై అధికార కూటమి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే షాడో సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. గీతం అంశం నేపథ్యంలో శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం ఎలా జరుగుతుందనే దానిపై ఇరువర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Jan 30 , 2026 | 01:05 AM